JMS News Today

For Complete News

ఈ పరిస్థితుల్లో కొత్తవి అవసరమా…?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూన్ 26: తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేసిన సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి… ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాలను నిర్మించాల్సిన అవసరం ఉందా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని… ఆయన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని… వాటన్నింటినీ ప్రభుత్వం నివృత్తి చేయాలని చాడ డిమాండ్ చేశారు. విశాఖ శారదాపీఠానికి ఒక రూపాయికి ఒక ఎకరం చొప్పున భూమిని కేటాయించారని… ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? అని మండిపడ్డారు. శారదా పీఠానికి భూములిచ్చిన ప్రభుత్వం జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇళ్ల స్థలాలను ఇవ్వలేదని దుయ్యబట్టారు. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని చాడ  ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *