అంతా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనే
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 19: కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. అధికార దాహంతోనే త్రిపుల్ తలాక్, సమాచార హక్కు చట్టం సవరణ, 370 ఆర్టికల్ రద్దు బిల్లులను ప్రవేశ పెట్టిందని విమర్శించారు. సోమవారం కరీంనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తోందని అన్నారు. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, రాజకీయ వలసలను మాత్రం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఇకపోతే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వ్యక్తిగత ప్రచార ఆర్భాటాలకు పరిమితమయ్యారని విమర్శించారు. అసెంబ్లీ, సచివాలయం తరలింపు పేరిట భూ రికార్డులను మాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరిట అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, వెంటనే ఆసుపత్రులకు పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో ప్రజా పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కో-కన్వీనర్ పోనగంటి కేదారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూన శోభారాణి, గూడెం లక్ష్మీ, కొయ్యడ సృజన్ కుమార్, జిల్లా నిర్మాణ కమిటీ సభ్యులు పంజాల శ్రీనివాస్, బండ రాజిరెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, బోనగిరి మహేందర్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కటికరెడ్డి బుచ్చన్న, బ్రహ్మణపెళ్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.