క్రికెట్ బెట్టింగ్ లపై కొరడా….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్
కరీంనగర్, అక్టోబర్ 2: క్రికెట్ బెట్టింగ్ రాయులపై పోలీసులు కొరడా ఝులిపించారు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో రెట్టింపు రాబడులు రాబట్టాలనే ఉద్దేశంతో క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు . ఈ మేరకు వారిపై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ మండలం తీగలగుట్టలపల్లిలోని ఓ రహస్య ప్రాంతంలో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ లకు పాల్పడుతున్నారన్న
పక్కా సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరెపల్లికి చెందిన బత్తిని హరికిరణ్, సిక్ వాడికి చెందిన చెరుకూరి సాయికృష్ణ, తీగలగుట్టపల్లికి చెందిన దాసరి మహేందర్, బేతి సాయికృష్ణ , కాశెట్టి శ్రవణ్, కాశెట్టి శ్రీనివాస్, రేకుర్తికి చెందిన గోలె అశోక్ లను అదుపులోకి తీసుకుని కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వీరి నుండి రెండు సెల్ ఫోన్లు, 15 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్లు ఆర్ ప్రకాష్ , శశిధర్ రెడ్డి , ఎస్ఐ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, బెట్టింగ్ లకు పాల్పడే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. రెట్టింపు లాభాలను ఆశించి బెట్టింగ్‌లకు పాల్పడటం నేరమని పేర్కొన్నారు. ఈ తరహా బెట్టింగ్‌లు నిర్వహించడం, ప్రత్యక్ష్యంగా పరోక్షంగా సహకరించే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వల్ప కాలంలో రెట్టింపు లాభాలను ఆశించడం ద్వారా కష్టపడి సంపాదించిన రూపాయలు పోగొట్టుకోవడం తప్ప మిగిలేది ఏమీ ఉండదనే విషయాన్ని గుర్తించాలని సిపి సూచించారు.