JMS News Today

For Complete News

ఆమె అంత్యక్రియలు రేపు….

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

ఢిల్లీ, జూలై 20: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు , ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గుండెపోటుతో మృతిచెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె…ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. పంజాబ్ లోని కపుర్తలలో 1938 మార్చి 31న షీలా దీక్షిత్ జన్మించారు. 15 ఏళ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె (1998 నుంచి 2013 వరకు) వ్యవహరించారు. కేరళ గవర్నర్ గా కూడా ఆమె పని చేశారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. ఆమె మరణం పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. షీలా దీక్షిత్ ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. గతంలో లోక్ సభ అంచనాల కమిటీకి ఆమె సేవలందించారు. కాగా, షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ తోపాటు పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. షీలా దీక్షిత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణవార్త వినాల్సి రావడం విచారకరమని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరకాలం గుర్తుంచుకునే రీతిలో ఢిల్లీకి కొత్త రూపునిచ్చారని కోవింగ్ కితాబిచ్చారు. ఈ విషాద సమయంలో షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ట్వీట్ చేశారు. షీలా జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునేవారంటూ షీలా దీక్షిత్ గురించి పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో ఆమె ఎంతో విలువైన భాగస్వామ్యం అందించారని తెలిపారు. షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. అటు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షీలా దీక్షిత్ మృతి పట్ల స్పందించారు. షీలా జీ మృతి వార్త వినాల్సి రావడం ఎంతో బాధాకరమైన విషయం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆమె ముద్దుబిడ్డ అని కీర్తించారు. ఆమెతో తనకు వాత్సల్యపూరితమైన అనుబంధం ఉందని రాహుల్ గుర్తుచేసుకున్నారు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించి నిస్వార్థమైన రీతిలో ఢిల్లీకి సేవలు అందించారని కొనియాడారు. షీలా దీక్షిత్ కుటుంబసభ్యులకు, ఢిల్లీ ప్రజలకు సానుభూతి తెలిపారు. కాగా, రేపు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు షీలా దీక్షిత్ భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ శ్రేణుల సందర్శనార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *