JMS News Today

For Complete News

ఎంపీకి బ్లాక్ మెయిల్ రాజకీయాలే ఇష్టం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 2: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శవ రాజకీయాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ ఆరోపించారు. ఎవరూ తనపై చేయి చేసుకోకపోయినా పోలీసులపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శనివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎన్నికల ఫలితం చూసైనా ఇతర పార్టీల నాయకులు బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. తెలంగాణా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో యువకులను మతం పేరిట ఎంపీ సంజయ్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పథకాలనే కేంద్రం ప్రవేశపెడుతున్న విషయాన్ని బీజేపీ నేతలు గ్రహించాలని సూచించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్లో అస్థిరత సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మాజీ కార్పొరేటర్ సునీల్ రావు మాట్లాడుతూ ఇన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులను గాలికి వదిలి గాంధీ యాత్ర చేసిన ఎంపీ సంజయ్ కి ఇప్పుడు కార్మికులు గుర్తుకు వచ్చారా అని ప్రశ్నించారు. బాబు అనే ఆర్టీసీ కార్మికుడి చావును బీజేపీ ఎంపీ తన స్వప్రయోజనాలకు వాడుకున్నారని, మూడు రోజులు ఆరేపల్లి గ్రామంలో డ్రామా చేశారని ఆరోపించారు. అంత్యక్రియల సందర్భంగా కుటుంబ సభ్యులను, ఆర్టీసీ నేతలను, ఇతర పార్టీల నేతలను పక్కన పెట్టి… రాజకీయ పబ్బం కోసం ఎంపీ సంజయ్ ప్రయత్నించారని విమర్శించారు. శవ రాజకీయాలు చేసిన ఎంపీ కరీంనగరానికి ఉండడం దురదృష్టకరమని అన్నారు. ఏ సమస్యపై కూడా అవగాహనా లేని స్థితిలో ఎంపీ ఉన్నారని చెప్పారు. ఆర్టీసీని కాపాడేది కేవలం టీఆర్ఎస్ సర్కారు మాత్రమేనని పేర్కొన్నారు. ఎంపీ అయిన దగ్గర్నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లో ఆయన చేసిన కార్యక్రమం ఒక్కటీ లేదని, కేవలం అభివృద్ధికి అడ్డుపడడమే బీజేపీ నాయకుల ఎజెండాగా కనిపిస్తుందని దుయ్యబట్టారు. శాంతియుతంగా ఉన్న జిల్లాను భగ్నం చేసేందుకు ఎంపీ బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ కార్పోరేటర్లు వాల రమణ రావు,  కంసాల శ్రీనివాస్, నలువాల రవీందర్,  నాయకులు గందె మహేష్, గంట శ్రీనివాస్ తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *