చుక్క నీరు వృధా పోవద్దు
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 1: సమస్త జీవకోటి మనుగడకు జలమే ప్రాణాధారమని, నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు సంరక్షించుకునే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన నీటి సంరక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు. భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో నీటి సంరక్షణ పనులను ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిని సంరక్షించేందుకు జిల్లాలో జలశక్తి అభియాన్ ప్రారంభమైందని చెప్పారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, బోర్ వెల్ పాయింట్ల వద్ద రీఛార్జి గుంతలు తవ్వి నీటిని సంరక్షించాలని తెలిపారు. గ్రామాల్లో, పొలాల్లో నీటి కుంటల నిర్మాణం చేపట్టాలని అన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టేందుకు జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు పనులను పర్యవేక్షిస్తారని చెప్పారు. ప్రతి మునిసిపాలిటీ తో పాటు అన్ని గ్రామ పంచాయితీలలో పనులు చేపట్టాలని అన్నారు. పంచాయతీలలో సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామ సభలను నిర్వహించి, తాగునీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జలశక్తి అభియాన్ ఆవశ్యకతపై గోడలపై రాతలు రాయించాలని అన్నారు. జల శక్తి అభియాన్ పథకం విజయవంతానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థతోపాటు వివిధ శాఖల అధికారులు ప్రజలు కృషి చేయాలని కోరారు. అంతకుముందు జల శక్తి అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకుంటామని, వర్షపు నీటిని సంరక్షించుకుంటామని, భావితరాలకు నీటి సమస్య లేకుండా చూస్తామని కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వెంకట మాధవరావు, డి ఆర్ డి ఎ వెంకటేశ్వరరావు మెప్మా పిడి పవన్ కుమార్ ఆర్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.