ఈరోజు నుంచే అమలు….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 28: హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హుజురాబాద్ ఉప ఎన్నికల నిర్వాహణపై ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబడుతుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరనకు చివరి తేదీ అక్టోబర్ 8 అని, అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన ఉంటుందని అన్నారు. అక్టోబర్ 12-13 వరకు నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 30న హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ ఉంటుందని, నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలు ప్రకటిస్తారని కలెక్టర్ వివరించారు. నవంబర్ 5లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మంగళవారం నుండే ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎన్నికల కోడ్) అమల్లోకి వచ్చిందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజురాబాద్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, చేతులను తరుచుగా సబ్బుతోగాని, సానిటైజర్ తో గాని శుభ్రపరుచుకుంటూ, భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది అందరూ రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా వేసుకొని ఉండాలని కలెక్టర్ తెలిపారు. అలాగే వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు తప్పకుండా రెండు డోసులు కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోని ఉండాలని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో కోవిడ్ నిబంధనలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ఎన్నికల తనిఖీ బృందాలను, ప్లైయింగ్ స్కాడ్ లను, స్టాటిక్ టీములను, వీడియో వీవింగ్ టీములను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్ మండలాలు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినందున వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని నిష్పక్షపాతంగా, కఠినంగా అమలు చేస్తామని అన్నారు. ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుటకు పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించి కంట్రోల్ రూములను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకొని ఉండాలని సీపీ సూచించారు.