JMS News Today

For Complete News

ఆహ్వానిద్దామా ? తరిమికొడదమా? తేల్చుకోండి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 25: ఏ ఉద్యమానికైనా ఊపిరిలూదే జిల్లా. చైతన్యం కలిగిన ప్రాంతం. అలాంటి కరీంనగర్ గడ్డపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో మన గడప వరకు వచ్చిన కరోనా వైరస్ ను తలుపు తీసి ఆహ్వానిద్దామా? తలుపు మూసి తరిమికొడదమా? అనే విషయాన్ని ఆలోచించాలి. కనిపించని శత్రువు తో పోరాటం చేస్తున్నాం. ప్రాణాల కంటే విలువైనది ఏమి లేదు. అందరూ ఇంటి పట్టునే ఉండండి. స్వీయ నియంత్రణే ఈ వైరస్ కు మందు అంటూ జిల్లా కలెక్టర్ కె శశాంక జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ ఇండోనేషియా వాసులు 10 మంది, జిల్లా వాసి ఒకరు మొత్తం 11 మంది గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆలాగే
ప్రస్తుతం హోం క్వారంటైన్, హాస్పిటల్ క్వారంటైన్ లో ఉన్న వారి పరిస్థితి ఇప్పటివరకు బాగానే ఉందని, అయినప్పటికీ వారిని మరో 14 రోజులు అలాగే ఉంచుతామని స్పష్టం చేశారు. మంగళ, బుధవారం నగరంలోని రెడ్ జోన్ లో ఉన్న ఏరియాలకు కూరగాయలు, పాలు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మొత్తం 3,718 కుటుంబాలు నివసిస్తున్నాయని, వారందరికీ అందిస్తున్నామని చెప్పారు. వారికి డోర్ డెలివరీ చేసేందుకు కూడా స్థానిక కిరాణ షాపులు, సూపర్ మార్కెట్ నిర్వాహకులతో సంప్రదిస్తున్నామని, పూర్తి వివరాలతో ఒక కరపత్రం విడుదల చేస్తామని వివరించారు.
వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత త్వరగా వ్యాధి నుండి బయటపడతామని తెలిపారు. సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్స్ వద్ద గుమిగూడి ఉంటే దుకాణదారులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పోలీసు కమీషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ లో పదకొండు పొజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఒకరు స్థానికుడు, పది మంది ఇండోనేషియా దేశస్తులు ఉన్నారని చెప్పారు. ఇండోనేషియా బృందంతో తిరిగిన వారందరిని క్వారంటైన్ లో ఉంచడం జరిగిందని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉందని, రాబోయే రెండు వారాలు చాలా కీలకమని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని, లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందని, దీనిని అందరూ గమనించాలని కోరారు. అనవసరంగా రోడ్ల మీదికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు మాకు సహకరించి, ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని కోరారు. అన్ని ప్రార్థనా మందిరాల దగ్గర ఎవరూ ప్రార్థనలు చేయకూడదని, ఇళ్ల దగ్గరే చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
హోం క్వారంటైన్ నుండి పారిపోయిన ఇద్దరు హుజూరాబాద్ వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేశామని అన్నారు. ఎమెర్జెన్సీ కి మాత్రమే 100 కి డయల్ చేయాలని, నిన్న రాత్రి నుండి ప్రతి చిన్న విషయానికి 100 కి చాల మంది కాల్ చేశారని తెలిపారు. హోం క్వారంటైన్ లో ఉండే వారి పాస్ పోర్ట్ లను ప్రభుత్వ ఆదేశాను సారం స్వాధీనం చేసుకున్నామని, హోమ్ క్వారంటైన్ తర్వాత వారి పాస్ పోర్ట్ లను తిరిగి ఇచ్చేస్తామని సీపీ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణీ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *