JMS News Today

For Complete News

తరుగు తీయడంపై కలెక్టర్ ఆగ్రహం…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఏప్రిల్ 28: కాంటా పెట్టిన తరువాత తరుగు తీస్తుండటంపై కలెక్టర్ కె.శశాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కాంటా పెట్టిన వెంటనే రైతులకు రశీదులు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు తెచ్చె ధాన్యంలో ఏలాంటి తరుగును చూపోద్దని కూడా ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి తనిఖీ చేశారు. గంగాధర మండలం గర్శకుర్తి, కొండన్నపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ పరిధిలో ఎన్ని ఎకరాలు సాగు చేశారని, ఇప్పటివరకు ఎన్ని ఎకరాలలో కోతలు పూర్తి చేసి ఎంత ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చారని, వచ్చిన ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని, అలాగే వరి కోత యంత్రాల వినియోగం, ధాన్యం శుభ్రపరుచుటకు వినియోగిస్తున్న ఫ్యాన్లు, జల్లెడల పనితీరు గురించి నిర్వాహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 278 ఎకరాలలో యాసంగి వరి సాగు చేశారని, ఇప్పటి వరకు దాదాపు అరవై శాతం కోతలు పూర్తి చేసి ధాన్యం రాగా, మిగిలిన 40 శాతం పంటను 10 రోజులలోగా పూర్తి చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ధాన్యంలో తాలు ఎక్కువగా ఉంటే ఒకటికి రెండు సార్లు తూర్పారపట్టే విధంగా రైతులకు సూచించాలని, కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అలాగే అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున టార్ఫాలిన్ లు అందుబాటులో ఉంచుకొవాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు సమయంలో ఏలాంటి తరుగు తీయొద్దని, అందుకే కాంటా పెట్టిన వెంటనే రశీదు ఇవ్వాలని, రశీదు ఇచ్చిన తదుపరి తరుగు తీస్తే రైతులకు ఏలాంటి సంబంధం లేదని, సెంటర్ నిర్వాహకులు, రైస్ మిల్లర్లదే తరుగు భాద్యత అని తెలిపారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న నర్సరీని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలో పెంచుతున్న చింత, వేప, అల్లనేరేడు, తులసి, దానిమ్మ మరియు కర్జూర ప్లాంటేషన్ లలో ఒక్క మొక్క కూడ చనిపోకుంటా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సార్లు పుష్కలంగా నీరు పోయాలని, అలాగే అవసరమైన మొక్కలు పెంచుటకు గ్రామాభివృద్ధి నిధుల నుండి కొంత నిధులు వెచ్చించి మొక్కలు పెంచుటకు విత్తనాలు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. తదుపరి రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహాకర సంఘంచే ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రశీదులు ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్బంగా తమ ధాన్యం ఎగుమతి అయిన తదుపరి కొంత తరుగు తీసి రశీదులు ఇస్తున్నారని ఇక్కడ రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు తెచ్చిన ధాన్యం కాంటా పెట్టగానే రశీదులు అందించాలని, లేనిచో చర్యలు తప్పవని నిర్వాహకులను కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట డి.ఆర్.డి.ఏ. పి.డి. వెంకటేశ్వర్ రావు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి మనోజ్ కుమార్, ఎం.పి.డి.వో. నర్సయ్య, ఎమ్.ఆర్.వో. జయంత్, గర్శకుర్తీ సర్పంచ్ నాగలక్ష్మీ, ఎం.పి.పి. శ్రీరాం, మధుకర్, ఎం.పి.టి.సి. రజిత, కొండన్నపల్లి సర్పంచ్ రాంరెడ్డి, ఎం.పి.టి.సి. రాజిరెడ్డి, దేశరాజుపల్లి సర్పంచ్ కోల రమేష్, ఎం.పి.పి. కవిత, ఎం.పి.టి.సి. వంచ మహేందర్ రెడ్డి, ఎం.ఆర్.వో. కోమల్ రెడ్డి, ఎం.పి.డి.వో. సతీష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *