సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు-జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ
1 min read
జగిత్యాల : ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను జిల్లా ప్రజలు నమ్మవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సింధు శర్మ తెలిపారు. బీహార్ జార్ఖండ్ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో ముఠాలు దిగినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ఏవైనా ప్రజలకు ఇబ్బందులు కలిగే సమస్యలు తలెత్తితే మొదట సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారని తెలియజేసారు. అంతేకాని నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరో ఆకతాయిలు, సంఘ విద్రోహక శక్తులు సృష్టించిన పోస్టులను ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినట్లు పోలీసు వారి దృష్టికి వస్తే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇలాంటి విషయాలలో గ్రామ పెద్దలు,సర్పంచులు,ప్రజా ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే పోస్టులను ఎవరైనా సృష్టించినా,వాటిని ఫార్వర్డ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీస్ శాఖ లో ప్రస్తుతం ఉన్న సాంకేతికత ఆధారంగా అలాంటి వారిని పట్టుకోవడం చాలా తేలిక అని తెలిపారు .ఇప్పటికే చాలా చోట్ల ఇలాంటి పోస్టులను వాట్సాప్, ఫేస్ బుక్, ఫేస్బుక్ ల ద్వారా ఫార్వర్డ్ చేసిన వ్యక్తులపై పలు చోట్ల కేసులు నమోదు చేసినట్లు వివరించారు. జిల్లా ప్రజలు ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఎస్పీ ఈ సందర్బంగా సూచించారు.