నల్లా నీళ్ళు ఇవ్వండి సార్లు….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 1: నల్లాలు ఇప్పే వారి నిర్లక్ష్యమో, లేక అధికారుల పర్యవేక్షణ కరువో, లేక మోటార్లతో తోడేస్తున్నారో, ఏమో తెలియదు కానీ ప్రజలకు చుక్క నీరు దొరకని పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా…మరోవైపు ఎండాకాలం మాదిరిగానే తాగు (నల్లా) నీటికి కష్టాలు తప్పడం లేదు. ఎవరికీ చెప్పిన ప్రయోజనం లేకుండా పోయింది. గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్నప్పుడు దినం తప్పి దినం మంచిగా వస్తుండే. మున్సిపల్ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి నీటి కష్టాలు ఆరంభమయ్యాయి. ఒక బిందె నీళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇదేక్కడో కాదు కరీంనగర్ జిల్లా కేంద్రానికి అనుకొని, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చిన సీతారాంపూర్ లోని ఎస్ ఆర్ నగర్ రోడ్డు నెంబర్-5 లోని పరిస్థితి. గురువారం నల్లా రాగా, చాలా మందికి బిందె నీళ్లు దొరకలేదు. ఎవరికీ చెప్పిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో కూడా నల్లా నీరు దొరకని పరిస్థితి నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ మున్సిపల్ అధికారులు స్పందించి నల్లా నీరు సరిగా సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.