కేటీఆర్ ఆర్డర్ వేసినా…తీరు మారలే
1 min read
కేటీఆర్ ఆర్డర్ వేసినా…తీరు మారలే
* కరెంటు పాక్ తో కార్మికుడు మృతి
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రాజన్న సిరిసిల్ల. జూన్ 23: ఫ్లెక్సీలు వాడకూడదని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో పలు మార్లు ఆదేశించినా మార్పు రావడం లేదు. చిన్నా చితకా ఫ్లెక్సీలు కడితేనే నానా హంగామా చేసే మున్సిపల్ అధికారులు…రాజకీయ నాయకులు వచ్చి పోయే సమయాల్లో స్వాగత తోరణాల్లాగా పెడుతున్న ఫ్లెక్సీల విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనితో పాలకులకు ఓ న్యాయం..? సామాన్య ప్రజానీకానికి మరో న్యాయమా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెండంతస్థుల ఓ భవనంపై ఫ్లెక్సీ ని కట్ట బోతూ ఒక కార్మికుడు కరెంట్ షాక్ గురై మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా…సిరిసిల్లలో ఇటీవలే పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా, ఆ సంఘ పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారని భారీ స్థాయిలో ఫ్లెక్సీలు కట్టేందుకు కార్యవర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా అంబేద్కర్ చౌరస్తాలో భవనంపైన ఫ్లెక్సీ కట్టే క్రమంలో కార్మికుడు సిరిసిల్లకు సుందరయ్య నగర్ కు చెందిన మోతె తిరుపతి (40) పైన ఉన్నటువంటి ఫ్రేమ్ కు విద్యుత్ షాక్ రావడంతో రెండంతస్తుల భవనం పైనుంచి రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై పడ్డాడు. ఇతనితో పాటు మరో ఇద్దరు కార్మికులు కూడా ఉండడంతో స్థానికులు వెంటనే సెస్ అధికారులకు సమాచారం ఇవ్వగా, సరఫరా నిలిపివేయడంతో వారు ప్రాణాపాయం నుండి బయట పడ్డారు. తీవ్ర గాయాల పాలైన తిరుపతిని అత్యవసర చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు లో ఉంది.