తెరాసకు బిగ్ షాక్..హుజురా’బాద్ షా’ ఆయనే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, నవంబర్ 2: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార తెరాసకు ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. తెరాసకు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్ లో మళ్ళీ గెలుపే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు చిన్న చితక లీడర్లు చేసిన అన్ని ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. మీ బిడ్డను ఇక
సాదుకుంటారో.. సంపుకుంటారో…మీ ఇష్టం అంటూ ఈటల భావోద్వేగంతో కూడిన మాటలతో ప్రజలు ఆయనను మరోమారు అక్కున చేర్చుకున్నారు. కేసీఆర్, ఈటల అన్న రీతిలో కొనసాగిన హుజురాబాద్ ఉప ఎన్నికలలో చివరకు ఈటల రాజేందర్ ఏడవ సారి విజయధుంధుబి మోగించారు. ప్రతి రౌండ్ లో ఈటల దూసుకుపోయారు. కేవలం రెండు రౌండ్ల (8,11) లో మాత్రమే అధికార తెరాస అభ్యర్థి గెల్లు అధిక్యంగా నిలిచారు. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు సొంతూరులో కూడా ఈటలకు అధిక్యం రావడం విశేషం. అటు హుజురాబాద్ ఎన్నికల సందర్బంగా కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపిస్తూ వచ్చిన
రాష్ట్ర బిజెపి రథసారధి బండి సంజయ్ ఇక అసెంబ్లీలో త్రిబుల్ ఆర్ (ఆర్ఆర్ఆర్) సినిమా చూపిస్తామంటూ పదేపదే చేసిన వ్యాఖ్యలు కూడా నిజమయ్యాయి. ప్రతి రౌండ్ లో ముందంజలో ఉన్న ఈటల రాజేందర్ 22 రౌండ్లు పూర్తయ్యే సరికి టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 24వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈటల గెలుపుతో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
కాగా, ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగింది. లెక్కింపు సందర్బంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది. కౌంటింగ్ పూర్తయ్యే వరకు కలెక్టర్ఆ ర్.వి.కర్ణన్, సీపీ సత్యనారాయణతోపాటు ఎన్నికల పరిశీలకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మొత్తానికి ఉత్కంఠ రేపిన ఈ పోరులో హుజూరా “బాద్ షా”గా ఈటల రాజేందర్ నిలిచారు.