ఈసారి ఆయన భిన్నంగా అసెంబ్లీకి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, నవంబర్ 10: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో మళ్లీ అడుగుపెట్టబోతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. బుధవారం ఉదయం 11 గంటలకు ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అసెంబ్లీ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈటల ప్రమాణ స్వీకారాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని రాష్ట్ర బీజేపీ, ఈటల మద్దతుదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాగా, ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఇది ఏడోసారి. ఇప్పటివరకు ఆరు సార్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా వ్యవహరించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత..2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా రెండుసార్లు పనిచేశారు. 2014 నుంచి అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ సీటింగ్ వైపు కూర్చున్నారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. ప్రతిపక్ష పార్టీల సీటులో కూర్చోనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. అదే పార్టీ నుంచి టికెట్ పై హుజూరాబాద్ బైపోల్ లో గెలిచారు. గత ఆరు సార్లకు భిన్నంగా ఏడోసారి బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రానున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాష్ట్రమంతటా ఆసక్తి రేపుతోంది. అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంలో ఈ ఆసక్తి మరింత పెరగనుంది. మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యేగా మొట్టమొదటి సారిగా అసెంబ్లీకి ఈటల రాక, ఆయన ప్రసంగాలు, ఆయన విమర్శలు, ప్రభుత్వం వివరణలు ఇవన్నీ రాబోయే రోజుల్లో హట్ హట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి.