సాయంత్రం చిన్నమ్మ అంత్యక్రియలు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
న్యూ ఢిల్లీ, ఆగస్టు 7: చిన్నమ్మ గొంతు మూగబోయింది. ఆమె ఇక లేరన్న వార్త అందరిని దిగ్భ్రాంతికీ గురిచేరిచేయగా, తెలంగాణ కంటతడి పెట్టింది. ఆహార్యంలో నిండైన భారతీయత.. ప్రత్యర్థులను సైతం మెప్పించే వాక్పటిమతో దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న మహా నాయకురాలు, బీజేపీ సీనియర్ నేత.. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ (67) మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఏర్పాటు లో కీలక పాత్ర భూమిక పోషించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడంతో పాటు చిన్నమ్మ గా, తెలంగాణ అడబిడ్డ గా కీర్తి గడించారు. ఆమె మరణం పట్ల తెలంగాణా సంతాపం తెలుపుతూ, నివాళులర్పించింది. ఆమె జ్ఞాపకాలను నెమరు వేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో తనకు నలతగా ఉందని చెప్పడంతో ఆమెను కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు అత్యవసర చికిత్స చేసేందుకు సిద్ధమైంది. కానీ, ఆమె అప్పటికే కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా మధుమేహంతో బాధపడతున్న ఆమె కిడ్నీలు దెబ్బతినడంతో కొన్నాళ్లపాటు డయాలసిస్ చేయించుకున్నారు. 2016 డిసెంబరులో మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనారోగ్యం కారణంగానే 2019 ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. అయితే ట్విటర్లో మాత్రం చురుగ్గానే ఉన్నారు. మంగళవారం తుదిశ్వాస విడవడానికి రెండు గంటల ముందు కూడా ఆమె..కశ్మీర్‌పై కీలక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. రాత్రి భోజన సమయం వరకూ కూడా ఆమె టీవీ చూస్తూ గడిపినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, ఆమె భౌతిక దేహాన్ని రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడితో పాటు పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ నేత రాహుల్, తెెెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈరోజు సాయంత్రం ఢిల్లీలో ఆమె అంత్య క్రియలు నిర్వహించనున్నారు.