ఆయనకు మతిభ్రమించింది..!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 20: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని టిఆర్ఎస్ నేత, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ విమర్శించారు. కార్పొరేటర్ నుంచి ఒక్కసారిగా ఎంపీగా గెలిచే సరికి ఆయన మానసిక ఉద్వేగానికి లోనై తనకు తాను అతిగా ఊహించుకుని తాను మినహా ఇతరులందరూ అవినీతిపరులనే భ్రమకు లోనైననట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రమేష్ మాట్లాడారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మచ్చలేని నాయకుడిగా అందరి మన్ననలు పొందుతున్న మంత్రి గంగుల కమలాకర్ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేక సంజయ్ అవాకులు, చవాకులు పేలుతున్నారని విమర్శించారు. కేవలం తన స్థాయి పెరగాలంటే కమలాకర్ పై, ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. సంజయ్ వ్యవహారశైలి నచ్చక బిజెపి నేతలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని సంజయ్ కి హితవు పలికారు. మీ అక్రమాలను కూడా ఆధారాలతో సహా బయటపెడతామని రమేష్ హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.