JMS News Today

For Complete News

కథనాయకులు కండి…ఈ ఎన్నిక అందుకే

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, సెప్టెంబర్ 28: తెరాస పార్టీ నీచానికి దిగితే..తెరాస నాయకులు పరమ నీచానికి దిగుతున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఐదు నెలల తెరాస నేతల హింస తరువాత కూడా హుజూరాబాద్ నియోజక ప్రజలు నావెంట ఉన్నారని, వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం హుజూరాబాద్ మధువనీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎన్నికల గంట మోగింది. ఏ ఇంటికి ఆ ఇల్లు కథానాయకులై ఎన్నికల కథనరంగాన్ని నడపాలని కోరారు. ఇది అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం జరుగుతున్న ఎన్నిక కాదు. ఇది కెసిఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. నేను మంత్రి వర్గం నుంచి బయటకు వచ్చిన దాదాపు 5 నెలల నుంచి ప్రగతి భవన్ నుంచి సిఎం డైరెక్షన్ లో హరీశ్ రావు, అరడజన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొర్రెల మందల మీద తోడేళ్లలాగా పడ్డారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామిక విలువలను అపహాస్యం చేసేవిధంగా నేను పార్టీలో ఉండగానే.. సొంత పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టి భయపెట్టి నాతో అనుబంధాన్ని తెంచే ప్రయత్నం చేసారని ఆరోపించారు. హుజురాబాద్ లో రాజకీయ వ్యవస్థ ఒకప్పుడు పచ్చటి సంసారంలాగా ఉండేదని, ఐదు నెలలుగా హుజురాబాద్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. రకరకాల ప్రలోభాల పేరుతో హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకునేలా చేసారని, మంత్రులుగా ఉన్నవాళ్లు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నవాళ్లు తమపాలసీలు, కార్యాచరణ చెప్పుకోవాలని, కానీ రాత్రి పూట పోలీసు జీపులు పెట్టుకుని హరీశ్ రావు సర్పంచులు, ఎంపీటీసీలను పిలిపించుకుని వారికి  ఆదేశాలిస్తూ చిటికలెస్తూ, చిందులేస్తూ… ఈటల వెంట ఉన్నవాళ్లను పట్టుకురావాలని ఆదేశించాడని ఆరోపించారు. కన్నీళ్లు దిగమింగుకుని, గుండెలు బరువెక్కినా చాలామంది తొణకకుండా నా వెంట ఉన్నారని, హుజురాబాద్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో యావత్ తెలంగాణ ఈటల గెలుపు కోసం చూస్తున్నారని తెలిపారు. ఇంత హింస, దౌర్జన్యం తర్వాత కూడా మొక్కవోని ధైర్యంతో నాకు అండగా ఉన్నవాళ్ల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనని,.18 ఏళ్లపాటు నేను చేసిన సేవకు నాకు ఇప్పుడు ఫలితం కనిపిస్తోందని చెప్పారు. అక్టోబరు 30న ఎన్నికలు జరగబోతున్నాయని, దసరా, బతుకమ్మ పండుగలు కూడా ఈ మధ్యలో జరుగుతాయని, కాబట్టి మీరే కథానాయకులై ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. అక్రమంగా పంపిస్తున్న డబ్బు సంచులను, పథకాల ప్రలోభాలను పక్కన పెట్టి ఆత్మగౌరవం కోసం నిలబడాలని,
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బాహుటా ఎగురవేసే రోజు అక్టోబరు 30 అని, ఆనాడు మీ బిడ్డగా నిండు మనస్సుతో ఆశీర్వదించాలంటూ కోరిన రాజేందర్
18 ఏళ్లుగా ఇప్పటి వరకు మీకోసం ఎలా పనిచేసానో…రాబోయే కాలంలో కూడా మీ నోట్లో నాలుకలాగా..మీరు అప్పజెప్పే బాధ్యతలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. 2న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ హుజురాబాద్ లో యథావిథిగా ఉంటుందని, అది ముందే డిసైడ్ చేసిన కార్యక్రమమని ఈ సందర్బంగా రాజేందర్ తెలిపారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ ఎన్నికల ఇంఛార్జి జితేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి,  బీజేపీ సీనియర్ నాయకులు ఇంద్రసేారెడ్డి, ఎండల లక్ష్మీ నారాయణ, ధర్మా రావు, తుల ఉమ, అశ్వద్ధామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *