ఔరంగజేబులా ఆయన పాలన..
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 10: నిరంకుశ విధానాలతో ప్రశ్నించే గొంతుక లేకుండా చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతరేయక తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ శాసనసభ్యులు కొత్తకోట దయాకర్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం న్యూ పికాక్ రెస్టారెంట్ లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్న వారిని, ప్రశ్నించే వారి గొంతుకలు నొక్కేందుకు ఔరంగజేబు అనుసరించిన ఫాసిస్టు, నిరంకుశ సిద్ధాంతాన్ని కేసీఆర్ అవలంబిస్తున్నారని ఆయన విమర్శించారు. గత కాంగ్రెస్ పాలకుల నియంతృత్వ, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం ఆవిర్భవించిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ ను మించిన నిరంకుశ పాలన సాగిస్తున్నారని, ప్రజాకంఠకులకు ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ అలవికాని వాగ్ధానాలు ఇచ్చి రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని ఆయన విమర్శించారు. బడ్జెట్ సందర్భంగా నిండు శాసనసభ లో కేసీఆర్ చేతులెత్తేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ సీఎం కూడా ఇలా శాసనసభలో చేతులు ఎత్తేసిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, ప్రజావ్యతిరేక పాలనపై పోరు సాగిస్తామని, పోరాటం లో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్ట చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి కొందరు స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ వీడారన్నారు. తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణం పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. అందులో భాగంగానే పార్టీ పార్లమెంట్ స్ధాయి కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పటిష్టత, కార్యకర్తల సంక్షేమానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. పార్టీ పునర్నిర్మాణం, పూర్వవైభవానికి అందరూ కలసికట్టుగా గా కృషి చేయాలన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించేలా సభ్యత్వాలు నమోదు చేయించాలని కోరారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎంఏ నజీర్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్, కరీంనగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కల్యాడపు ఆగయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర సత్యం, టిఎన్టియుసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రబెల్లి రవీందర్, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల బాలా గౌడ్, సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి పులి రాంబాబు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు నూజెట్టి వాణి, టి ఎస్ ఎన్ వీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రవీందర్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు టేకుల శ్రావణ్ తోపాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, ఈ సందర్భంగా నగరంలోని 28వ డివిజన్ కు తెలంగాణ బహుజన్ సేనా అసోసియేషన్ వ్యవస్థాపకుడు గొర్రె సంపత్ కుమార్ తన 50 మంది అనుచరులతో టీడీపీ లో చేరారు. వీరికి దయాకర్ రెడ్డి కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.