టీఆర్ఎస్ కు షాక్…..!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 9: అధికార తెరాసకు పెద్ద షాక్ ఇచ్చారు ఆ పార్టీ లోని గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన ఓ పెద్ద నేత. రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో రామగుండం నుంచి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే గా పోటీ చేసి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆర్టీసీ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. తాజా గా పార్టీని వీడారు. మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ లో ఆరాచకాలు పెరిగాయని ఆరోపించారు. తనపై, తన అనుచరులపై పోలీసులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. కొందరి ప్రవర్తన వల్ల పార్టీ లో ఇమడలేక పోతున్నానని వెల్లడించారు. తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి అడగకుండానే కేసీఆర్ ఇచ్చినట్లు గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమారపు సత్యనారాయణ పార్టీని వీడటం చర్చనీయాంశం కాగా, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కి కొంతమేర నష్టం జరగవచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.