JMS News Today

For Complete News

పోలీసులకు పని కల్పించాలనుకుంటున్నారా..?

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 8: హోంమంత్రి పదవిలో ఉన్న అమిత్ షా హైదరాబాద్ లో రెచ్చగొట్టేలా మాట్లాడారని, దీన్ని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ నేత,  మాజీ ఎంంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. బెంగాల్ లాగా తెలంగాణ కావాలని కోరుకోవడమంటే హింసను ప్రేరేపించడమేనని పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హోంమంత్రి అంతర్గత భద్రతను కాపాడేలా మాట్లాడాలే తప్ప హింసను ప్రేరేపించేలా మాట్లాడటం సరికాదని అన్నారు.  హింసకు తావు లేకుండా తెలంగాణ ఉద్యమం నడిపించి రాష్ట్రం సాధించామని, బెంగాల్ తరహా రాజకీయ హింసను ప్రోత్సహిస్తే చూస్తూ ఊర్కోబోమని హెచ్చరించారు. శాంతి ఉన్నచోటనే అభివృద్ధి ఉంటుందని, పోలీసు మంత్రిగా ఉన్న అమిత్ షా ఇక్కడి పోలీసులకు పని కల్పించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. వీధి పోరాటాలు చేస్తాననడం ఆయన స్థాయికి తగదని, 15 రోజులకో మంత్రిని పంపిస్తాననడం ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ముందుగా జల మంత్రి షకావత్ ను పంపించి మా ప్రాజెక్టులు చూసి నిధులివ్వమనండని, తర్వాత గడ్కరీని పంపించి మేము గతంలో పంపించిన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయమనండని హితవు పలికారు. పీయూస్ గోయల్ ను పంపించి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేయమనండి, పదిహేను రోజులకో మంత్రిని పంపండి,  తెలంగాణకు కావాల్సిన అవసరాలు తీర్చండి, మేము మంత్రులకు ఏడాది సరిపడా ఎజెండా ఇస్తామంటూ పేర్కొన్నారు. కానీ అమిత్ షా ఎజెండా తెలంగాణ వ్యతిరేక ఎజెండా అని, మీ పార్టీని విస్తరించుకుంటే విస్తరించుకోండి. శాంతికి విఘాతం మాత్రం కలిగించకండి అంటూ సూచించారు. వీధి పోరాటాలు కాదు సైద్ధాంతిక పోరాటం చేద్దామని, రైల్వే గురించి బడ్జెట్ లో చర్చనే లేదని విమర్శించారు. ప్రత్యేక రైల్వే బడ్జెట్ పెట్టాలని, కొత్తపల్లి -మనోహరా బాద్ రైల్వే లైన్ ను నిర్వీర్యం చేయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఈ సారి ఈ లైన్ కు తక్కువ నిధులిచ్చారని పేర్కొన్నారు. రైతుబంధు, మిషన్ భగీరథను బీజేపీ కాపీ కొట్టిందని, 40 లక్షల మందికి మేము ఫించన్లు ఇస్తున్నామని, మీరిచ్చేవెన్నో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను తిప్పికొడ్తామని,
తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తే.. రాష్ట్రం సాధించిన పార్టీగా మేం చూస్తూ ఊర్కోబోమని మరోమారు హెచ్చరించారు.
తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు రాకుండా కేసీఆర్ అడ్డుపడుతున్నారంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దెవా చేశారు. ప్రాణహిత చేవెళ్ల తెచ్చిన్నాడు అధికారంలో ఉన్న మీరు ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. ఈ రాష్టానికి బీజేపీ, కాంగ్రెస్ పనికి రాని పార్టీలని అన్నారు. సభ్యత్వ నమోదులో ఊరూరా ఈ పార్టీల తీరును ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో పుట్టిన వాళ్ళందరికీ ఇప్పుడు ఓటు హక్కు రాబోతోందని,  అలాంటి వాళ్లకు సభ్యత్వంలో ప్రియార్టీ ఇస్తామని వినోద్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు,  చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నాయకులు ఈద  శంకర్ రెెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *