JMS News Today

For Complete News

ఊహాగానాలు షురూ..అందరిలో ఉత్కంఠ

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, ఆగస్టు 6: కేసీఆర్ కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. అది కూడా ఆగస్టు చివరి వారంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఇటు టీఆర్ఎస్, అటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. మరి కేసీఆర్ ఎవరికి ఛాన్స్ ఇస్తారనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది. మంత్రి పదవికి దూరమైన హరీష్ రావుకు ఈసారి మంత్రి అయ్యే ఛాన్స్ ఉందా ? టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అవకాశం ఉందా ? గతంలో ఇద్దరి మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానన్న కేసీఆర్ ఈ విస్తరణలో తన మాట నిలబెట్టుకుంటారా..?  లేదా అనే అంశాలపై అందరిలో ఆసక్తి, ఉత్కంఠ నెెలకొంది. ఇదిలా ఉంటే ఆగస్టు చివరి వారంలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని, ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రివర్గంలో నలుగురికి ఛాన్స్ కల్పించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లను కేసీఆర్ మంత్రివర్గంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉండగా, సబితారెడ్డి, సుఖేందర్ రెడ్డిలకు ఛాన్స్ ఇస్తే, ఇప్పటికే ఉన్న ఒకరిద్దరికి ఉద్వాసన పలుకుతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇకపోతే కేసీఆర్ మంత్రివర్గంలో పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా, టీఆర్ఎస్ పార్టీలో కూడా  కొందరు నేతలు హరీష్ ను మంత్రివర్గంలో తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎంను చేసేందుకే హరీశ్ ను మంత్రివర్గంలో తీసుకోవడం లేదని అటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి హరీష్ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ తోపాటు 12 మంది మంత్రులు ఉన్నారు. వాస్తవానికి పూర్తి కేబినెట్ లో సీఎంతో కలిపి మెుత్తం 18 మందికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అంటే మరో ఆరుగురికి కేబినెట్ లో స్థానం దక్కనుండగా, ప్రస్తుతానికి  కేసీఆర్ నలుగురికే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు మంత్రి పదవులను మున్సిపల్ ఎన్నికల తరువాత భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇకపోతే ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ మంత్రివర్గంలో ఉన్నారు. జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఇదే జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కు ఛాన్స్ ఇవ్వనున్నారు. మరీ కేటీఆర్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వేరొకరికి కట్టబెడతారా లేక రెండూ కేటీఆర్ చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీష్ కు ఛాన్స్ లభించనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్ధిపేట నుంచి హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో అత్యధిక సార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. ఖమ్మం జిల్లా కు సంబంధించి ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలుకావడంతో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈసారి జరగబోయే కేబినెట్ విస్తరణలో మహిళకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవకాశం కల్పిస్తారని సమాచారం. సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే తెలంగాణ తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అయితే, మెుదటి ఐదేళ్లు మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించ లేదు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్ గా నియమించగా, మరికొందరిని ప్రభుత్వ విప్ లుగా నియమించారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూడా మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదంటూ విపక్షాలు పెద్దఎత్తున విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అసెంబ్లీలో మంత్రివర్గంలో మహిళలకు ఎందుకు స్థానం కల్పించలేదంటూ నిలదీసింది. ప్రతిపక్ష ప్రశ్నకు సమాధానంగా జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిపదవి కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఇకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి మరోసారి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భవిష్యత్ లో జరిగే మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తానని లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డిలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లక్ష్మారెడ్డి రాకతో ఆ సంఖ్య మూడుకు చేరుకోనుంది. మొత్తానికిి కేసీఆర్ కేబినెట్ విస్తరణ పై ఊహాగానాలు మొదలు కాగా,  మంత్రి యోగం ఎవరికీ దక్కనుంది ? సమీకరణల నేపథ్యంలో ఎవరి మంత్రి పదవి ఊడనుంది ? అన్న  ఉత్కంఠ, ఆసక్తి అందరిలో నెలకొంది. కేసీఆర్ నిర్ణయం ఏలా ఉండబోతోందో విస్తరణ దాకా వేేేచి చూడాల్సిందే మరీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *