కాడెడ్లు కదట్లే…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూన్ 30: వేసవి ముగిసినా చినుకు జాడ లేదు. వర్షం చుక్క కోసం జనం ఆకాశానికేసి ఆశగా చూస్తోంది. జూన్లో జోరుగా పడాల్సిన వానలు నెలాఖరొచ్చినా కనిపించలేదు. ఫలితంగా పొలాల్లో కాడెడ్లు కదలడం లేదు. రుతుపవనాలు విస్తరించిన తర్వాత కూడా ముఖం చాటేస్తున్న మేఘం రైతులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇంకా ఎండ తీవ్రత కొనసాగుతూనే ఉంది. వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. ఖరీఫ్ ప్రారంభంలో అక్కడక్కడా కురిసిన వర్షాలు ఆ తరువాత జాడలేకుండా పోయాయి. మరికొన్నిచోట్ల అసలు వర్షమే లేకపోవడంతో వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టకపోవడం శోచనీయం. ఈ ఏడాది రుతుపవనాలు వారం ఆలస్యంగా కేరళను తాకాయి. ఆ తరువాత అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రుతుపవనాల విస్తరణకు అడ్డంకిగా మారడంతో పాటు అటు అరేబియా సముద్రం, ఇటు భూ ఉపరితలంపై తేమను తీసుకుపోయింది. ఆ తరువాత రుతుపవనాలు పుంజుకున్నా ఆశించిన వర్షాన్ని ఇవ్వలేదు. దక్షిణాది మొత్తానికి రుతుపవనాలు విస్తరించాయని చెప్పడమే తప్ప చినుకు కురిసిన దాఖలాలు లేవు. శనివారానికి దేశ రాజధాని ఢిల్లీని రుతుపవనాలు తాకాల్సి ఉండగా, అందుకు మరో నాలుగైదు రోజులు పడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల చినుకులు పడాలని ప్రజలు, రైతులు పూజలు చేస్తున్నారు. దేవుళ్ళకు జలాభిషేకాలు, హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తున్నారు. ఏదిఏమైనా చినుకు కోసం రైతుల బిత్తర చూపులను చూసైనా వరుణ దేవుడు కరుణిస్తాడో లేదో వేచిచూద్దాం.