మహిళా తహసిల్దార్ సజీవ దహనం…!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
రంగారెడ్డి, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తహసీల్దార్ అక్కడికక్కడే తీవ్ర గాయాలతో మృతి చెందారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దుండగుడు తహసీల్దార్ ఛాంబర్లోకి వెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ దుండగుడు కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. తహసీల్దార్‌ను కాపాడే యత్నంలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన తహసీల్దార్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని హయత్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం దుండగుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఏర్పడిన తర్వాత విజయారెడ్డి తొలి తహసీల్దార్‌గా నియమితులయ్యారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు. నిందితుడు కాలిన గాయాలతో ఉండటంతో సమీపంలోని ఏదైనా ఆస్పత్రికి వెళ్లి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు లో ఉంది.