ఎక్కి పెళ్లి సుబ్బు చావు కు….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 2: పోడు భూములపై పోడు రైతులు వర్సెస్ అటవీ అధికారుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. చాలా ఏళ్లుగా రైతులు పోడు పట్టాల కోసం నిరీక్షిస్తున్నారు. అయితే, ఎన్నికల ముందు టీఆర్ఎస్ పోడు రైతులకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా పట్టాలు ఇవ్వకపోవడంపై సర్కారుపై కోపంగా ఉన్నారు. ఇదే క్రమంలో హరితహారం కోసం అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వస్తున్న అటవీ ఆదికారులు, సిబ్బందిపై పోడు రైతులు కర్రలతో దాడులు చేస్తున్నారు. కాగజ్ నగర్ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకు పాకింది. ఇక్కడ మొక్కలు నాటుతున్న అటవీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ క్రమంలో ఎక్కి పెళ్లి సుబ్బు చావు కొచ్చింది అన్న చందంగా మారింది అటవీ సిబ్బంది పరిస్థితి. ఓ వైపు ప్రభుత్వం పోడు భూముల్లో హరితహారం కింద మొక్కలు నాటాలని ఆదేశించడం, మరో వైపు పోడు భూముల జోలికి రావద్దంటూ పోడు రైతుల రగడ వెరసి అటవీ అధికారులకు తలనొప్పిగా మారింది. కాగజ్ నగర్ ఘటనలో అనిత అనే అధికారిని గాయపడటం, పలువురు సిబ్బంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కపల్లి మండలం గుండాలపాడు పంచాయతీ పరిధిలో కొందరు అక్రమంగా అటవీ భూముల్లో పోడు చేస్తున్నారనే సమచారంతో అటవీ సిబ్బంది అడ్డుకోవడానికి మంగళవారం వెళ్లారు. అయితే.. గ్రామానికి చెందిన పోడు రైతులు అటవీ సిబ్బందిపై కర్రలతో చితకొట్టారు. వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూముల పంచాయతీ ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాగజ్ నగర్ ఘటన జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడవిలో ఉండే ఆదివాసీలకే పోడు భూములు చెందాలని వాళ్లు పోరాడుతుండగా.. చట్టప్రకారం అటవీశాఖ అధికారులు హరితహారం పేరిట మొక్కలు నాటడానికి వెళ్తుండటంతో.. పోడు రైతులు దాడులకు పాల్పడుతున్నారు. కాగజ్ నగర్ ఘటనపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని బాద్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇలాంటి దాడులు సహించేది లేదంటూ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టం చేశారు. మొత్తానికి మొక్కలు నాటకపోతే ప్రభుతంతో, నాటితే పోడు రైతుల తిరుగుబాటుకు గురికావాల్సి వస్తుందని అటవీ సిబ్బంది మదన పడుతున్నారు.