JMS News Today

For Complete News

ఆ ఎన్నికలో అలా…ఈ ఎన్నికలో ఇలా…

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, నవంబర్ 25: అధికార తెరాసకు కంచుకోటగా ఉన్న కరీంనగర్ లో తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరిలో ఆసక్తి రేపుతోంది. ఏ ఎన్నికలు వచ్చిన కరీంనగర్ లో విజయధుంధుబి మోగించే టిఆర్ఎస్ ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక తరువాత ఆ ఓటమిపై సమీక్షించుకుంటున్న సమయంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాగా,  అధికార తెరాసకు మరో షాక్ తగిలినట్లయింది. టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రెబల్ గా నామినేషన్ వేయడంతోపాటుగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు రెండు పేజీల లేఖ రాసారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి, ఎమ్మెల్సీ ఎన్నికలో సీనియర్ నేత సింగ్ రాజీనామా ప్రస్తుతం తెరాసలో హట్ టాఫిక్ గా మారింది.

సింగ్ రాసిన లేఖ యధావిధిగా…
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారికి నమస్కరించి బాధాతప్త హృదయంతో రాస్తున్న నాయొక్క రాజీనామా పత్రం. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని మీ పిలుపును అందుకొని నేను భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ నగర శాఖ అధ్యక్షుడిగా రాజీనామా చేసి మీ సమక్షంలోనే టిఆర్ఎస్ పార్టీలో చేరి అప్పుడు జరుగుతున్న మీ పార్లమెంటు ఎన్నికలలో మీ గెలుపు కోసం పనిచేయడం జరిగింది. నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన నుండి ఉద్యమ వ్యాప్తి కోసం మీ అడుగులో అడుగు వేసి మీరు ఏ పిలుపు ఇచ్చిన దాన్ని కరీంనగర్ నగరంలో అమలుపరిచి తెలంగాణ ఉద్యమాన్ని టిఆర్ఎస్ పార్టీని సమాంతరంగా ముందుకు తీసుకుపోవడం కోసం ఆరోజు నుండి ఈ రోజు వరకు పనిచేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మీరు ఏ పిలుపు ఇచ్చిన దానిని అమలు చేయడం కోసం చిత్తశుద్ధితో పనిచేసాను. ఆ సందర్భాలలో మీరే నాకు స్వయంగా ఎం.ఎల్.సి. గా అవకాశం ఇస్తానని వాగ్దానం చేసినారు. ఇలా ఒకసారి కాదు చాలాసార్లు మాట ఇచ్చారు. మాటలు నమ్మి నేను పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి సిద్దపడితే మీరు గౌరవ స్వామిగౌడ్ గారికి అవకాశం ఇచ్చారు. మీ నిర్ణయాన్ని గౌరవించి వారి గెలుపు కోసం పనిచేశాను. వారి పదవి కాలం పూర్తి అయిన తర్వాత కూడా నాకు అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చి వేరే ఒకరికి అవకాశం ఇచ్చారు. అప్పటికి కూడా మీ నిర్ణయాన్ని గౌరవించి పార్టీ ఎదుగుదల కోసం పని చేశాను. కానీ మీరే స్వయంగా రవీందర్ సింగ్ కు స్థానిక సంస్థలలో 25 సం॥ల అనుభవం ఉంది. ఇక నీకు ఎం.ఎల్.సి. గా అవకాశం ఇస్తానని జిల్లా ప్రజాప్రతినిధుల సాక్షిగా మాట ఇచ్చారు. నేటికి మీ మాట నిలబెట్టుకోలేకపోయారు. కనీసం మీరు ఇచ్చిన మాట మీకు గుర్తుం చేద్దాం అని మీ సమయం కోరితే కలవడానికి కూడా మీరు సమయం ఇవ్వడం లేదు. కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి కాని జిల్లాలో కొందరు నాయకుల వ్యవహార శైలికాని మీకు వివరించాలనుకుంటే మీరు సమయం ఇవ్వడం లేదు. టిఆర్ఎస్ పార్టీ కొందరు ఉద్యమ ద్రోహుల చేతులో బందీ అయింది. మీరు తెలంగాణ ఉద్యమంలో లేని వారిని, అసలు ఒక్క రోజు కూడా జై తెలంగాణ అని నినాదం చేయని వారిని, మీ పక్కకు చేర్చుకొని కరీంనగర్లో పార్టీని భ్రష్టు పట్టించిన కూడా మీరు వారిని పల్లెత్తు మాట అనకుండా ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చిన, ఎన్ని రకాల ఆరోపణలు కథనాలుగా టి.వి. లల్లో , పేపర్లలో వచ్చిన మీరు పట్టించుకోకపోవడం అలాంటి వారిని మీ పక్కకు చేర్చుకొని, అసలుసిసలైన తెలంగాణ ఉద్యమకారులను దూరం చేసుకుంటున్నారు. మనకు అధికారం రాకముందు తెలంగాణ ఉద్యమకారులను మీరు ఏ విధంగా గౌరవించేవారో మీకు అధికారం వచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత ఉద్యమకారుల పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఉద్యమకారుల పరిస్థితి చూసి బాధ కలిగి కన్నీళ్ళు వచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం అని ఓపికతో సహించి వున్నాము. తెలంగాణ ఉద్యమ ద్రోహులను అధికారంలో అందలమెక్కిస్తూ తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసిన వారందరిని అవమానాలకు గురిచేస్తూ వారికెలాంటి అవకాశాలు ఇవ్వకుండా పార్టీ కండువాలు కప్పుకున్నదే తడువుగా మీరు వారికి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడాన్ని భరించలేకపోతున్నాం. టిఆర్ఎస్ పార్టీని కూడా కొందరి ఉద్యమ ద్రోహుల చేతులో పెట్టి వారు చేసిందే శాసనం అన్నట్టుగా కరీంనగర్ జిల్లాలో వ్యవహరిస్తే కూడా మీ నుండి చర్యలు లేక టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా వారి జేబు సంస్థగా మారడం చూస్తుంటే ఇక టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు నిజమైన కార్యకర్తలకు స్థానం లేదని గ్రహించి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మీరు ఇప్పటివరకు నాపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతాభివందనాలు. ఇట్లు
సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్, కరీంనగర్ నగరపాలక సంస్థ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *