ఒంగోలులో దారుణం…16 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్
1 min read
ఒంగోలులో దారుణం…16 ఏళ్ళ బాలికపై గ్యాంగ్ రేప్
* ఒంగోలు ఘటన పై హోం మంత్రి సుచరిత అరా
* నేరస్తులపై కఠిన చర్యలు : డిజిపి.గౌతం సావాంగ్
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
ఒంగోలు, జూన్ 23: ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన స్నేహితుడిని వెతుక్కుంటూ ఒంగోలుకు వచ్చిన బాలికపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన బాలిక (16) విజయవాడలోని ఓ హాస్టల్లో చదువుతోంది. ఆమెకు అక్కడ ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తితో స్నేహం ఏర్పడడంతో అతడిని వెతుక్కుంటూ నగరానికి వచ్చింది. గత సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఒంగోలు బస్టాండ్‌కు చేరుకున్న బాలిక వద్ద ఫోన్ లేకపోవడంతో వేరే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకొని స్నేహితుడికి ఫోన్ చేసింది. ఫోన్ కలవకపోవడంతో ఏం చేయాలో తెలియక రాత్రి 10గంటల వరకు బాలిక అక్కడే ఉండిపోయింది. బాలికపై కన్నేసిన ఫోన్ ఇచ్చిన వ్యక్తి సురక్షితంగా అతడి వద్దకు చేరుస్తామంటూ నమ్మించాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి బాలికను నలుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ఉండే గదికి తీసుకెళ్లి నిర్బంధించారు. ఆరుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఐదు రోజులపాటు బాలికపై అమానవీయంగా అత్యాచారం చేశారు. దీంతో వారి కబంధ హస్తాల నుంచి బయటపడిన బాలిక శనివారం ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘాతుకానికి పాల్పడిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరిత ఈ ఘటనపై ఆరా తీశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ తో మాట్లాడిన సుచరిత..మిగిలిన నిందితులను వెంటనే అరెస్ట్..చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ఈ సంఘటనను డిజిపి గౌతం సావాంగ్ తీవ్రంగా ఖండించారు. మహిళలపై నేరాలను సహించబోమని, ఎపి పోలీసులు ఇలాంటి నేరస్థుల పట్ల కఠినమైన చర్యలతో వ్యవహరిస్తారని ఆయన పేర్కొన్నారు. నిందితులకు విజయవంతంగా శిక్ష పడాలంటే కేసును క్షుణ్ణంగా విచారించాలని డిజిపి ఎస్పీని ఆదేశించారు.