వారికీ పదవుల గోలే….!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
నల్గొండ, జూలై 15: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, తెలంగాణ రాష్త్రం దేశానికే దారిచూపిస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నాగార్జునసాగర్‌లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.18 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ కిట్‌తో గర్భవతులకు వైద్యం అందిస్తూ, ఆర్థిక చేయూత ఇస్తున్నామన్నారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలు ఏర్పాటును ఎవరూ ఊహించలేదన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ప్రజల బాగోగులు అస్సలు పట్టవని విమర్శించారు. వారికెప్పుడూ పదవులు, కమీషన్లు కావాలని రాజేందర్ ఆరోపించారు. మరో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే రూ.50వేల కోట్లను సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకం దేశంలోనే గొప్ప పథకంగా గుర్తింపు పొందిందన్నారు. వైద్య రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెంచేలా చర్యలు చేపట్టామని, అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. నాగార్జునసాగర్‌ని మున్సిపాలిటీ చేసిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు.