పులకించిన అంజన్న సన్నిధి….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
జగిత్యాల, మే 25: పెద్ద హనుమాన్ జయంతోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా ముత్యంపేట మండలంలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధి భక్తజనంతో పులకించిపోయింది. మంగళవారం రాత్రి నుంచే అంజన్నను దర్శించుకునేందుకు ఇటు భక్తులు, అటు హనుమాన్ దీక్షాపరులు కొండగట్టుకు తరలిరాగా, బుధవారం ఉదయం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తుల తాకిడి రాత్రి వరకు కూడా కొనసాగింది. కొండగట్టుకు తరలివచ్చిన భక్తులకు ఆ పవనసుతుడిని దర్శించుకునేందుకు సుమారు నాలుగైదు గంటలు సమయం పట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్, మెదక్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నుంచేకాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. మండలం, అర్థ మండలం, పదకొండు రోజులు దీక్షలు తీసుకున్న హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేశారు. కొండగట్టు ఆలయంతో పాటు పరిసరాలు కాషాయ వనంలా మారి అంజన్న సన్నిధి కొత్త శోభను సంతరించుకుంది. అటు చాలీసా పారాయణాలు, దండక పఠణాలు, రామలక్ష్మణ జానకీ..జై బోలో హనుమాన్ కీ అంటూ భక్తులు నినందించిన రామ నామ స్మరణలతో అంజన్న కోవెల మారుమ్రోగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టింది. మొత్తానికి రామనామ స్మరణలతో అంజన్న కోవెల మారుమ్రోగగా, భక్తజనం అంజన్న దర్శనం చేసుకుని తరించిపోయారు.