ఆయన ఎందుకు రాలేదో… ?
1 min read
కరీంనగర్ : కోటి ఎకరాల మాగాణి ని గోదారి నీళ్లతో తడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేయాలనే భావన లో ఉన్న కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ ప్రాజెక్టు ను ప్రారంబిస్తున్న వేళ…ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అహర్నిశలు శ్రమించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కనిపించకపోవడం స్థానికంగా చర్చినీయాంశమైనది. 2016 మే 2న సీఎం కేసీఆర్ భూమి పూజ చేసిన వెంటనే ఇరిగేషన్ మంత్రిగా హరీష్ పనులు మొదలుపెట్టి రాత్రనక, పగలనక 24 గంటలు అధికారులు, ఇంజనీర్లు, కూలీలతో పనులు చేయిస్తూ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి చేసిన కృషిని ఎవరూ కాదనలేనిది. పనుల వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు వెల్లడించిన హరీష్ ను …ఒక దశలో ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన చూపిస్తున్న కృషిని చూసి గవర్నర్ నరసింహన్ కాళేశ్వర్ రావుగా నామకరణం చేసిన సంగతి అందరికి తెలిసిందే. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హరీష్ కి మంత్రి పదవి ఇవ్వకపోగా, ఆ శాఖను కేసీఆర్ నిర్వహిస్తున్నారు. అప్పటినుంచి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ను మానిటరింగ్ చేస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. .అయితే, ప్రాజెక్టు ప్రారంభ తేదీని ప్రకటించిన నాటి నుంచి హరీష్ రావును పిలవాలి, మంత్రి పదవి ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా విదితమే. ఆయనను పిలువ లేదా పిలిస్తే రాలేదా అన్న చర్చ జరిగింది. కారణాలేమైనా హరీష్ కాళేశ్వరం ప్రారంభానికి దూరంగా ఉండడం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల వేళ… హరీష్ ముందుముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది.