JMS News Today

For Complete News

ఆయనంటే అందరికీ ఆసక్తే ….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూన్ 25: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఒకరి పేరు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎవరంటే తన్నీరు హరీష్ రావు. ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఎవ‌రు అవున‌న్నా. కాద‌న్నా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం నుంచి హరీష్ రావుకు మద్దతుగా సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం కన్నీరు పెడుతోంది తన్నీరు లేక అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఏ ఆలోచ‌న‌తో అయితే హ‌రీశ్ రావు ప్ర‌స్తావ‌న లేకుండా చంద్రశేఖర్ రావు వ్య‌వ‌హ‌రించారో.. అదే ఆయ‌న‌కు పీడ‌క‌ల‌గా మారుతుంద‌ని.. కాళేశ్వ‌రం ఓపెనింగ్ డేట్ తెలంగాణ భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ల్యాండ్ మార్క్ గా మారుతుంద‌న్న మాట తెలంగాణ వాదుల నుండే కాకుండా హరీష్ అనుచరుల నుండి పెద్ద యెత్తున వినిపిస్తోంది. ఇదే తరుణంలో హరీష్ గులాబీ పార్టీకి ధీటుగా మరో పార్టీ పెట్టబోతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే హరీష్ మాత్రం కేసీఆర్ తీరును సమర్థిస్తూ, ఉందగా వ్యవహరిస్తున్నారు. ఇదే అందరిలో ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో తాజాగా ఒకట్రెండు రోజుల నుంచి హరీష్ రావు బీజేపీలోకి వెళ్తున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజానికి ఈ వార్త నిజమైతే బాగుండు అని చాలామందిలో ఉందట. కానీ ఈ వార్తల పై హరీష్ రావు మాత్రం చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. కొన్ని మీడియా సంస్థలు నా గురించి తప్పుడు న్యూస్ రాస్తున్నారని.. దీని పై డీజేపీకి కూడా ఫిర్యాదు చేశానని.. ఇలాంటి తప్పుడు న్యూస్ రాసేవాళ్ళని పట్టుకొని బుద్ధి చెప్పాలని డీజేపీని కోరానని.. నేను ఎప్పుడూ ఒకే మాట మీద కట్టుబడి ఉన్నానని.. అదే.. నా పుట్టుక, చావు రెండు ‘తెరాస’లోనని హరీష్ రావు స్పష్టం చేశారు. మా నాయకుడు కేసీఆర్ సారథ్యంలోకి మేము ముందుకి వెళుతూ, తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని హరీష్ రావు చెప్పుకొచ్చారు. ఇంతవరకూ బాగానే ఉంది గాని, హరీష్ రావుకి కేసీఆర్ ఉన్నట్లు ఉండి ప్రాధాన్యం ఎందుకు తగ్గించారనే విషయం గురించి మాత్రం హరీష్ రావు చెప్పలేదు. ఇదిలా ఉంటే, హరీష్ రావుకి కేసీఆర్ ఎందుకు ప్రాధాన్యం తగ్గించారు ? తనయుడు కేటీఆర్ కోసమా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒకవేళ కేసీఆర్ కుమారుడి కోసమే హరీష్ రావు లాంటి నాయకులను పక్కన పెడితే చంద్రబాబుకి పట్టిన గతే కేసీఆర్ కి కూడా పడుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా తెలంగాణ రాజకీయాల్లో హరీష్ పేరు హల్ చల్ చేస్తుండగా, అయన మాత్రం ఉందగా వ్యవహరిస్తుండడం అందరిలో ఆసక్తి రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *