వారి ఆర్థికాభివృద్ధికి కృషి
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 16: మత్స్యకారులు దళారులు, బ్రోకర్ల బారినపడకుండా ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మీనోత్సవం కార్యక్రమంలో భాగంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా వంద శాతం సబ్సిడీ పై పంపిణీ చేసిన నాలుగు లక్షల చేప పిల్లలను మంత్రి ఎల్ఎండి రిజర్వాయర్ నీటిలో వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని తెలిపారు. అంతరించిన కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ కొత్త పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో పాటు చేపలు పట్టుకునేందుకు వలలు, పట్టిన చేపలను మార్కెట్ లో అమ్ముకునేందుకు మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్ లు, ఆటోలు, డీసీఎం వ్యాన్ లు అందజేశామని పేర్కొన్నారు. రాబోయే కాలంలో మత్స్య సంపద పెరిగి మత్స్యకారులు ఆర్థిక అభివృద్ధి చెందుతారని మంత్రి రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రసమయి బాలకిషన్ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.