JMS News Today

For Complete News

జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 15: కాళేశ్వరం జలాలు కరీంనగర్ ను ముద్దడాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలే మారనున్నాయని తెలిపారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన పంద్రాగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి రాజేందర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మించబడిన ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్ర సృష్టించబోతున్నదని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తుందని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో లక్షా 16 వేల 653 మంది రైతులకు రూ.171.65 కోట్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు. గ్రామాలలో రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల ఘర్షణలకు దారి తీస్తున్న నేపథ్యంలో వాటిని పరిష్కరించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి రికార్డులను సరిచేశామని అన్నారు. గ్రామాలకు జీవనాధారమైన చెరువులను పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామలం చేయడానికి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. తాగునీటి సమస్యలు తీర్చడానికి మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పర్యావరణాన్ని రక్షించడానికి తెలంగాణ హరితహారం పథకం పేరిట మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. వీటితోపాటు కంటి వెలుగు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఆహార భద్రత తదితర పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దుతూ, పేదలకు ఉత్తమ వైద్య సేవలను అందిస్తున్నామని అన్నారు. ఇవే కాక చేనేత కార్మికులు, మత్స్య కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణలో కరీంనగర్ పోలీస్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. అంతకుముందు పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన మంత్రి రాజేందర్ విశేష సేవలు అందించిన పలువురికి ప్రశంస పత్రాలను అందజేశారు. తదుపరి వివిధ యూనిట్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీ కాంతారావు, జడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే సుంకేేే రవిశంకర్, కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *