మంత్రి రాజేందర్ ఏమన్నారంటే….
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 17: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పునరుద్గటించారు. శనివారం స్థానిక దాసరి గార్డెన్ లో జరిగిన ట్రస్మా రాష్ట్ర సర్వసభ్య సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రైవేటు పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల స్పందిస్తూ ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించారు. 2019 -21 సంవత్సరానికి అధ్యక్షుడిగా యాదగిరి శేఖర్ రావు, ప్రధాన కార్యదర్శిగా సామ మధుసూదన్, కోశాధికారిగా పి. నాగేశ్వర్ రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం కొత్తగా ఎన్నికైన పాలకవర్గం మంత్రి రాజేందర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ 2002 ట్రస్మా ఆవిర్భావం నుండి సంఘంలో క్రియాశీలకంగా ఉంటూ ప్రైవేటు పాఠశాలల సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రైవేటు పాఠశాలల పాత్ర ఎనలేనిదని గుర్తు చేశారు. సమాజ నిర్మాణంలో విద్యా సంస్థలు కీలకమైన భూమిక పోషిస్తాయని, విద్య లో ప్రైవేటు, ప్రభుత్వ అనే తేడా లేకుండా అన్ని విద్యా సంస్థలు భావి తరాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకు కారణమైన అన్ని సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, కరీంనగర్, చొప్పదండి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, సుంకే రవి శంకర్ తోపాటు పలువురు నాయకులు, కరస్పాండెంట్ లు తదితరులు పాల్గొన్నారు.