99శాతం సాధారణ జ్వరాలే…!
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
పెద్దపల్లి, సెప్టెంబర్ 13: విష జ్వరాలపై జరుగుతున్న ప్రచారాలకు వాస్తవ పరిస్థితులకు తేడా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత, ఐడీసీ ఛైర్మెన్ ఈద శంకర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, గ్రంథాలయ ఛైర్మెన్ రఘువీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
మంత్రి ఈటెల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ సిబ్బంది, ఎఎన్ఎంలు, ఆశా వర్కర్ల సమన్వయంతో గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని సూచించారు. 99శాతం సాధారణ జ్వరాలే ఉన్నాయని తెలిపారు. పీహెచ్ సీ వైద్యులు గ్రామాల్లో హెల్త్ క్యాంపు లు ఏర్పాటు చేయాలని, అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అత్యాధునిక లాబ్ పరికరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మందుల కొరత లేదని, రాబోయే రోజుల్లో హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లకుండా జిల్లా ఆసుపత్రులు ఆధునికరిస్తామని తెలిపారు. అంతకుముందు గోదావరిఖని ప్రభుత్వ హాస్పత్రిలో ఎన్టీపీసీ సీఎస్ఆర్-సీడి నిధులతో నిర్మిస్తున్న 50 అదనపు పడక గదులకు శంకుస్థాపన చేశారు.