JMS News Today

For Complete News

మంత్రి సుడిగాలి పర్యటన….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, సెప్టెంబర్ 10: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మంగళవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా నల్గొండ జిల్లా సూర్యాపేట ఏరియా ఆస్పత్రిని మంత్రి ఈటల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు చిన్నారులకు రోటా టీకాలు వేశారు. వైద్యకళాశాల విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం చేపట్టిన సమీక్షలో ఆస్పత్రిలో సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి మంత్రులు ఆరా తీశారు. అనంతరం మంత్రి ఈటల మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రెండు నెలల పాటు సెలవులు పెట్టవద్దని వైద్యులు, సిబ్బందికి సూచించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కూడా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై ప్రతి జిల్లాలో మంత్రులు సమీక్ష చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం ఆసుపత్రిపై ప్రజలకు అపార విశ్వాసం ఉన్నదని చెప్పారు.
ఎన్నో అవార్డులు గెలుచుకున్న రికార్డు ఈ ఆసుపత్రి కి ఉన్నదని అన్నారు. 400 బెడ్లు ఉన్న ఈ ఆసుపత్రి లో 600 మంది ఇన్ పేషంట్లు ఉన్నారని, 15 వందల మంది నిత్యం ఓపీ వస్తోందని వివరించారు.150 నుంచి 200 అదనపు తాత్కాలిక బెడ్స్ ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ కు అధికారం ఇస్తామని, అవసరమైన సిబ్బందిని కూడా తాత్కాలిక పద్దతిలో పెంచుకుంటామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని కాపాడతామని,
మెడికల్ కాలేజి కావాలన్న డిమాండ్ ఉన్న నేపధ్యంలో కేంద్రం ఆలోచన మేరకు ఖమ్మం, కరీంనగర్, మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజిలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అన్నీ డెంగీ, మలేరియా ఫీవర్లు కాదని, 95 నుంచి 98 శాతం జ్వరాలు వెంటనే తగ్గిపోయేవేనని చెప్పారు. అన్నీ జ్వరాలు అదుపులోకి వస్తున్నాయని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జ్వరాలను రాకుండా నివారించవచ్చునని పేర్కొన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుపడాలని 30 రోజుల ప్రణాళికను సీఎం కేసీఆర్ మొదలుపెట్టారని అన్నారు. అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకోస్తామని,
ఒకేసారి 200 మందికి రక్త పరీక్షలు నిర్వహించే పద్దతి వచ్చేసిందని వివరించారు. సమీక్ష సమావేశంలో అధికారులకు మరిన్ని ఆదేశాలు ఇస్తామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంత్రి వెంట ఖమ్మం ఎంపీ నాగేశ్వరరావు, కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం జడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఖమ్మం కలెక్టర్ ఆర్.కర్ణన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *