సమ్మె తీవ్రరూపం..సెలవుల పొడిగింపు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 12: ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెను తీవ్రతరం చేసేందుకు ఆర్టీసీ జేఏసీ వారం కార్యాచరణ ప్రకటించగా, మరోవైపు సమ్మె కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదని దసరా సెలవులను మరో వారం పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు సర్కార్, ఇటు కార్మికులు పంతం వీడటం లేదు. ఫలితంగా సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తోపాటు ఇతర డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం పట్టు వీడటం లేదు. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మెను మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13న రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై వంటావార్పు, 14న బహిరంగ సభలు, 15న రాస్తారోకోలు, 16న ర్యాలీలు, 17న ధూంధాం, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని నిశ్చయించారు. అంతేకాకుండా ఈ నెల 19న తెలంగాణ బంద్ కు జేఏసీ పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా, ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టడంతో ప్రజా రవాణాకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి పూర్తిస్థాయిలో లేవని విమర్శలు కూడా వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు దసరా సెలవులను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 19 వరకు సెలవులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి అక్టోబరు 14 నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ సమ్మె కొనసాగుతుండడంతో వారం పాటు సెలవులు పొడిగించారు. సమ్మెలో మార్పు రాకపోవడంతో ప్రభుత్వానికి మరోసారి సెలవులు పొడిగించక తప్పలేదు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు సమకూర్చుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అలాగే మూడు రోజుల్లో ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎక్కువ సంఖ్యలో బస్సులు తిరిగేలా చూడాలని కేసీఆర్ ఆదేశించారు.