అసలేం జరగనుంది…!?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, డిసెంబర్ 15: కరీంనగర్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తుండగా, మంత్రి గంగుల మంత్రాంగం అసంతృప్త నేతల పక్క చూపులను నిలువరిస్తుందా…? రాష్ట్రంలోనే క్రేజ్ లీడర్ గా మారిన కమలం దళపతి బండి తన సొంత గడ్డపై వదిలిన ఆకర్ష్ మార్క్ ఏలా ఉండబోతోంది…? ఈ పరిణామాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి…? రాజకీయ సమీకరణలు ఏలా మారనున్నాయి…? అన్నది ప్రస్తుతం హట్ టాపిక్ గా మారగా, ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఓటమెరగని అధికార తెరాసకు ఇటీవల జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలో ఓటమి చవిచూడగా, ఆ తరువాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఎదురుగాలి వీచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లో అనూహ్యంగా బలం పుంజుకున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి నజర్ వేసింది. ఈ క్రమంలో కొత్త ఉత్సాహంతో కమలం దళపతి బండి సంజయ్ తనదైన శైలిలో ఆకర్ష్ మంత్రాన్ని కొనసాగిస్తూ, ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ముఖ్య నేతలు బిజెపి లో చేరారు. టిఆర్ఎస్ ముఖ్య నేత, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, కాంగ్రెస్ ముఖ్య నేత విజయశాంతి తదితరులు
కాషాయ కండువ కప్పుకున్న సంగతి కూడా తెలిసిందే. వీరితో పాటు పలువురు నేతలు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు బండి తన సొంత గడ్డపై వదిలిన ఈ ఆకర్ష్ మంత్రాంగంతో కరీంనగర్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు హిటెక్కిస్తున్నాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, అతని భార్య కార్పొరేటర్ మంజుల టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు త్వరలోనే బిజెపిలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. తమతోపాటు మరికొంత మంది టిఆర్ఎస్ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, ముఖ్య నేతలు బిజెపి లో చేరనున్నట్లు ప్రకటించగా, టీఆర్ఎస్ లో ఒక్కసారిగా కాక రాజుకుంది. ఈ క్రమంలో మంత్రి కమలాకర్ వెంటనే అప్రమత్తమయ్యారు. పార్టీని వీడే ఆలోచనలో ఉన్న నేతలు, కార్యకర్తలను తన మంత్రాంగంతో మార్పించి అందరిని ఒక్కతాటిపైకి తెచ్చే పనిలో పడ్డారు. ఆదివారం రాత్రి ఒక ప్రముఖ హోటల్ లో 44 మంది కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. వారంతా ఆ సమావేశంలో పార్టీని వీడబోమని, మంత్రి మాటను జవదాటమని కూడా స్పష్టం చేశారు. ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన పార్టీకి నష్టం లేదనే సంకేతాన్ని మంత్రి కమలాకర్ ఇచ్చారు. స్వార్థపరులే పార్టీని వీడుతున్నారని నాయకులకు, కార్యకర్తలకు ధైర్యం కూడా చెప్పారు. అయితే, ఈ సమావేశం అనంతరం అదే హోటల్లో విందు ఏర్పాటు చేయగా, ఆ విందులో పలువురు కార్పొరేటర్లు గొడవ పడినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలకు బిజెపి గాలం వేసినట్లు, వారంతా త్వరలోనే కాషాయ కండువ కప్పుకోనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా తన పరిధిలోని కరీంనగర్, కొత్తపల్లి రూరల్ మండలాల ఎంపీటీసీలు , సర్పంచులు , జడ్పీటీసీలు , ఎంపీపీలు, ఇతర ప్రతినిధులతో త్వరలోనే మంత్రి గంగుల భేటీ కానున్నారు. మొత్తానికి కరీంనగర్ లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తుండగా, మంత్రి కమలాకర్ మంత్రాంగం అసంతృప్త నేతల పక్క చూపులను నిలువరిస్తుందా…? తన సొంత గడ్డపై బండి ఆకర్ష్ మార్క్ ఏలా ఉండబోతోంది…? అనే ఉత్కంఠ ఇరు పార్టీల శ్రేణుల్లో నెలకొనగా, ఈ అంశం మాత్రం కరీంనగర్ లో హట్ టాపిక్ గా మారింది. వేచి చూద్దాం మరీ ఏం జరగనుందో.