కీలకఘట్టం ముగిసింది….ఇక అందరిలో ఉత్కంఠ
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, అక్టోబర్ 30: రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోని కీలకఘట్టం ముగిసింది. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు కొనసాగిన పోలింగ్ ప్రక్రియ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. అయితే, 2018 ఎన్నికల కంటే ఈసారి ఉప ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ పెరిగింది. 2018లో 84.5 శాతం నమోదు కాగా, ఈ ఉప ఎన్నికలలో 86.33శాతం నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతంపై పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితాలపై రాజకీయ విశ్లేషకులు కూడికలు, తీసివేతలతో అంచనాలు వేస్తున్నారు. పెరిగిన పోలింగ్ ఎవరికీ అనుకూలంగా మారనుందోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొనగా, అభ్యర్థుల భవితవ్యం ఈవిఎంలలో నిక్షిప్తమై స్టాంగ్ రూములలో భద్రంగా ఉన్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవిఎంలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తరలించారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఉత్కంఠ రేపిన హుజురాబాద్ ఉప ఎన్నికల కీలకఘట్టం ముగియగా, ఇక ఫలితాలపై ఇటు అభ్యర్థుల్లో, అటు పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది.