వారికి ఆ టెన్షన్ పట్టుకుందా…!?
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, అక్టోబర్ 7: మళ్ళీ అధికార తెరాసకు గత ఎన్నికల తీరు రిఫిట్ కానుందా? కారు పోలిన గుర్తులతో ఓట్లు చీలిపోయి తమ అభ్యర్థుల పరేషాన్ అయిన నేపథ్యంలో హుజూర్ నగర్ ఉప ఎన్నికలపై అదే దిగులు పట్టుకుందా ? ఈ ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన తరుణంలో కాంగ్రెస్ కంచుకోటలో జెండా ఎగరేయాలని భావిస్తున్న గులాబీ దళాన్ని ఎన్నికల గుర్తులు ఒకింత ఆందోళనకు గురిచేస్తుందా? గతంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అవుననే అనిపిస్తుండగా, ఇదే అంశం ప్రస్తుతం అక్కడి నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. రెండోసారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా ఉంది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా గెలిచిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా విజయం సాధించడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార తెరాస వ్యూహ రచన చేసుకుంది. నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి ఒక్కో మంత్రి, ఒక్కో కులానికి ఒక్కరి చొప్పున ఇన్చార్జీలుగా నియమించింది. అయితే, ఎన్నికల గుర్తులు ఆ నేతలను కొంత ఆందోళనకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో కారు పోలిన గుర్తులతో తమ అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారని, ఇకముందు అలా గుర్తులు ఇవ్వకుండా చూడాలంటూ టీఆర్ఎస్ నేతల బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే. అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఆటో, రోడ్ రోలర్, ట్రక్కు తదితర గుర్తులు ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ క్రమంలో కారును పోలిన గుర్తులు ఆటో, ట్రక్కు రోడ్ రోలర్ వంటి గుర్తులు ఉన్న నేపథ్యంలో…గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఈసారి అలా జరగకుండా చూడాలని తెరాస నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలకు గుర్తులపై అవగాహన కల్పించాలని గులాబీ బాస్ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మొత్తానికి అధికార టీఆర్ఎస్ కు గుర్తుల పరేషాన్ పట్టుకోగా, ప్రజలకు అవగాహన కల్పించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు.