JMS News Today

For Complete News

ఆ శాఖ అంతే…దానికి జవసత్వాలు అవసరం

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో సమాచార శాఖ అచేతనావస్థకు చేరుకుందని, ఆ శాఖలో నిబంధనలు, విధానాలు అధికారుల ఇష్టాఇష్టాల మీద ఆధారపడి నడుస్తున్నాయని ఐజేయూ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సమాచార శాఖకు జవసత్వాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.
పత్రికలు, జర్నలిస్టులు, సమాచార హక్కు చట్టం, ట్రేడ్ యూనియన్లను రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. బుధవారం కరీంనగర్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాచార శాఖను సాంస్కృతిక శాఖలో విలీనం చేసి, ఓ చిన్న స్థాయి అధికారిని దానికి అధిపతిని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమే దీనికి నిదర్శనమని అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల విలేకరులకు నివేశన స్థలాలు జారీ చేసేందుకు ఎలాంటి అవరోధాలు లేకున్నప్పటికీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను సాకుగా చూపుతుండటాన్ని తప్పుబట్టారు. కోర్టు ఉత్తర్వులు కేవలం హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కి మాత్రమే వర్తిస్తాయని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో స్థానిక మంత్రుల చొరవతో జర్నలిస్టులకు నివేశన స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేస్తూ మిగిలిన ప్రాంతాలలో దీనిని ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం చూపగలగే ఏకైక సంస్థ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమేనని అన్నారు. ఇటీవలి కాలంలో యూనియన్ నిర్వహించిన పోరుబాట విజయవంతమైన విషయాన్ని గుర్తు చేశారు. ఆందోళనలు చేసినంత మాత్రాన ఏమి జరిగిందని నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఫలితాలు ఆలస్యంగానైనా వస్తాయన్నారు. రాష్ట్రంలోని 586 మండలాలకు గాను 542 మండలాల్లో , 71 రెవెన్యూ డివిజన్లకు గాను 61 రెవెన్యూ డివిజన్లలో పోరుబాట విజయవంతం అయిన విషయాన్ని గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాల సందర్భంగానైనా, అంతకుముందు అయినా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళనలు చేపట్టడానికి రాష్ట్ర యూనియన్ కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికలకు అక్రిడేషన్ ల విషయంలో జరుగుతున్న అన్యాయంతో పాటు అక్రిడేషన్ లలో నిబంధనల పేరుతో మిగిలిన పత్రికలు, ఛానళ్లలో పనిచేయుచున్న జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్తామన్నారు. అవసరమైతే పీసీఐ నుండి రెండు బృందాలను రాష్ట్రానికి రప్పించి వాస్తవాలను వారికి నివేదించే ప్రయత్నం చేస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ అక్రిడిటేషన్ లు, నివేశన స్థలాలు, హెల్త్ కార్డులు జర్నలిస్టుల ప్రాథమిక అవసరాలే అయినప్పటికీ వాటితో పాటు జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన చట్టాలను నీరుగార్చే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రధానంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో అనేక సవరణలు చేయడం ద్వారా వాటిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో ఈ విధానాలను తాము ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తున్నామని, అయితే ఇందులో ఏ మేరకు ఫలితం సాధించగలమో వేచి చూడాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్రిక యాజమాన్యాలను గుప్పెట్లో పెట్టుకుందని, ఇందులో యాజమాన్యాల స్వార్థం కూడా ఉందన్నారు. జర్నలిస్టుల వేతన సవరణ, పనిగంటలు, ఇతర చట్టాలను పరిరక్షించుకోవడంతో పాటు వాటిని అమలు చేసే విధంగా చూడడానికి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ఎం ఏ మాజిద్, మాజీ సభ్యుడు అమరనాథ్, ఐజేయూ జాతీయ కార్యదర్శి నరేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, దాసరి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు తాడూరు కరుణాకర్, రాం నారాయణ, కోశాధికారి మైపాల్ రెడ్డి, దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ రమేష్, కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు గాండ్ల శ్రీనివాస్, జానంపేట మారుతి స్వామితో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన యూనియన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఐ న్యూస్ కరీంనగర్ బ్యూరో రవీందర్ తన పదవికి రాజీనామా చేసి ఐజెయు అనుబంధం టీయూడబ్ల్యూజే సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు యూనియన్ జాతీయ, రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ రెడ్డి, అమర్, శేఖర్, విరహత్ అలీ స్వాగతం పలికారు. త్వరలోనే హైదరాబాద్ బషీర్బాగ్ యూనియన్ కార్యాలయంలో ఎంపిక చేసిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *