అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, ఆగస్టు 30: గత రెండు సంవత్సరాలుగా కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలలో వరుస దొంగతనాలు చేస్తూ, భారీగా బంగారం,వెండి, నగదు దోచుకెళ్తూ, ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్న ఏడుగురు సభ్యులు గల ఘరానా అంతర జిల్లా దొంగల ముఠాను చాకచక్యంగా కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మైనర్ కాగా, సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన మురిమురి రంజిత్ (38), కందారపు సాయి వర్మ (19), ఎల్వకా సాయిరాం (19), బైరి రాజు (26), విలసాగరం రజనీకాంత్ (19), ఎనగందుల నాగరాజు (31) అనే ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి సుమారు 23లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ కమలాసన్ రెడ్డి ముఠా వివరాలు వెల్లడించారు. కరీంనగర్ తో పాటు చుట్టు పక్కల జిల్లాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలాగైనా దొంగలను పట్టుకోవాలన్న సీపీ
ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు నేర స్థలాలలో తిరుగుతూ, సాక్ష్యాలను సేకరిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను గుర్తించి, ఎట్టకేలకు అల్గునూర్ చౌరస్తా వద్ద ముఠాను పట్టుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకొని విచారించగా, నాలుగు జిల్లాల్లో చేసిన నేరాలనన్నింటిని ఒప్పుకోవడంతో ఆయా కేసుల్లో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులను పట్టుకోవడంలో శ్రమించిన పోలీసులను ఈ సందర్భంగా సీపీ అభినందించారు.