JMS News Today

For Complete News

కర్కశం..ఆపై కాకమ్మ కథలు…చివరకు కటకటాల్లోకి

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, మార్చి 2: కన్న తండ్రే కాలయముడయ్యాడు. కూతురు అనారోగ్యానికి పెట్టాల్సిన ఖర్చులకు జడిసి కర్కశంగా ప్రవర్తించాడు. అనారోగ్యంతో పడుకున్న బిడ్డ మొఖంపై దిండుతో నొక్కి..ఆపై గొంతు కోసి మరీ చంపాడు. చావుతో కొట్టుకుంటున్న కూడా కన్న ప్రేగు కరగలేదు. చివరకు కళ్ళ ముందే కన్న బిడ్డ అసువులు బాసింది. పైగా హత్యగా చిత్రీకరించి కేసు తప్పుదోవ పట్టించాడు. సంచలనం సృష్టించిన రాధిక హత్య కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు ప్రతిష్టాత్మక జర్మన్ టెక్నాలజీ సైతం వినియోగించారు. 21 రోజులు..8 బృందాలు… 75 మంది పోలీసు సిబ్బంది కేసు చేధనలో నిమగ్నమయ్యారు. తండ్రి చెబుతున్న ఆ కాకమ్మ కథలను కనిపెట్టిన పోలీసులు నిందితుడి నోటి నుండి నిజాన్ని కక్కించారు. ఇంకేముంది సంచలనం సృష్టించిన రాధిక హత్య కేసు మిస్టరీ వీడిపోయింది. నిందితుడు ముత్త కొమురయ్య (45) ని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ కమలాసన్ రెడ్డి రాధిక హత్య కేసు వివరాలను వెల్లడించారు. కరీంనగర్ నగరంలోని విద్యానగర్ లో నివసిస్తున్న ముత్త కొంరయ్య గోదాంగడ్డ లోని గోడౌన్ల లో హమాలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, గత కొద్ది సంవత్సరాలుగా తన కూతురు ముత్త రాధిక తీవ్ర అనారోగ్యం, పోలియోతో బాధపడుతూ ఉండేది. రాధిక ఆరోగ్యం బాగు నిమిత్తం కుటుంబ సభ్యులు చాలా హాస్పిటల్స్ కి తిరిగి చికిత్స చేయించారు. చికిత్స కోసం దాదాపు 6 లక్షల రూపాయల వరకు ఖర్చు కూడా పెట్టారు. ఒక సంవత్సరం క్రితం రాధికకు శస్త్ర చికిత్స చేయడం వల్ల నయమైంది. అనంతరం కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ కాలేజి లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజుల నుండి రాధిక మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుండగా, మళ్ళీ డబ్బులు ఖర్చుపెట్టి నయం చేయించే స్థోమత లేని రాధిక తండ్రి కొంరయ్య ఎలాగైనా తన బిడ్డను చంపాలని నిర్ణయించుకొని గత కొద్ది రోజులుగా పక్కాగా ప్లాన్ వేసుకున్నాడు.
ఈ మేరకు తన ఇంట్లో కిరాయికి ఉంటున్న పోచయ్య కుటుంబాన్ని బలవంతంగా గత నెల ఫిబ్రవరి 6న ఇళ్ళు ఖాళీ చేయించాడు.
తన పథకం ప్రకారం ఫిబ్రవరి 10న ఎలాగైనా రాధిక ను చంపాలని నిర్ణయించుకొని, తన భార్యని కూలి పనికి పంపించి, బయట పరిస్థితులు గమనించడానికి కిరాణం షాప్ కి ఉప్పు కొనడానికి వెళ్లినట్లు వెళ్లి, తిరిగి వస్తుండగా తన ఇంటి పక్కన ఫంక్షన్ హాల్ కి వాచ్ మెన్ గా ఉన్న వీరేశం కుక్క చనిపోగా, అతనితో మాట్లాడుకుంటూ వచ్చి, వాళ్ళు అందరూ ఇంట్లోకి వెళ్లిపోగా, ఇంటికి వచ్చిన కొంరయ్య తన బిడ్డ రాధిక బెడ్ పై దుప్పటి కప్పుకొని పడుకోవడం చూసి, అదే అదునుగా భావించి గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి, తన బిడ్డ పక్కన గల బరువైన దిండు ను తీసి,రాధిక ముఖం పై శ్వాస రాకుండా అదిమిపెట్టి చంపేశాడు. ఆ తర్వాత రాధిక మృతి పై పోలీసులకు అనుమానం రావొద్దని, రాధిక మృతదేహాన్ని బెడ్ పై నుండి కింద వేసి, కిచెన్ లో గల కత్తిని తీసుకువచ్చి, విచక్షణ రహితంగా ఆమె మెడని కోసి, అట్టి కత్తిని కడిగి, రక్తం పడిన బనియన్లని పిండి, పైన ఆరవేసి, ఇంట్లో వాళ్ళకి కూడా అనుమానం రాకుండా అన్నం తిని, టిఫిన్ బాక్స్ పెట్టుకొని, అలాగే బయటకి వచ్చిన తర్వాత ఇంటి వెనకాల కుక్క చనిపోయిన బాధలో ఉన్న వాచ్ మెన్ వీరేశం తో కాసేపు మాట్లాడి, పనికి వెళ్తున్న, డోర్ దగ్గరకి పెట్టుకో బిడ్డ అని గట్టిగా చుట్టుపక్కల వాళ్ళకి వినపడే విధంగా చెప్తూ అక్కడి నుండి అతను పనిచేస్తున్న గోదాంకి సైకిల్ పై వెళ్లాడు. అలాగే వెళ్లే ముందు ఇంట్లోని సెల్ఫ్ లో గల తన భార్య చైన్ ని కూడా ముందుగానే బియ్యం బస్తాలో కనపడకుండా దాచిపెట్టాడు. పని వద్దకు వెళ్ళాక ఎవరికి అనుమానం రావొద్దని తన భార్యకు, ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని, యదా ప్రకారం తన హమాలి పనిచేశాడు. అదేరోజు సాయంత్రం చుట్టుపక్కల వాళ్ళు చూసి, రాధిక హత్య చేయబడిందని తెలుసుకొని, తన కొడుకు వేణుకి ఫోన్ ద్వారా తెలుపగా అతను తన తండ్రికి ఫోన్ ద్వారా తెలపడానికి ప్రయత్నించగా, కలవక పోవడంతో, తన తండ్రితో పాటు పనిచేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి, తన తండ్రితో రాధిక హత్య గురించి చెప్పగా, ఏమి తెలియని వాడిగా ఏడ్పు నటిస్తూ, ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చాక అమాయకంగా నటిస్తూ, పోలీసులు వచ్చి ఏమైనా డబ్బులు, బంగారం పోయిందా అని అడుగగా, ఇంట్లో గల 3 తులాల బంగారు ఆభరణాలు, 99, 000 నగదును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, తన బిడ్డను చంపి ఎత్తుకెళ్లారని కొత్త నాటకానికి తెరలేపాడు. కరీంనగర్ తో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును ఎలాగైనా ఛేదించాలని సవాలుగా తీసుకున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి ప్రత్యేక్ష పర్యవేక్షణలో అడిషనల్ డిసిపిలు చంద్రమోహన్, శ్రీనివాస్ ల ఆద్వర్యంలోని పోలీస్ సిబ్బంది 8 బృందాలుగా ఏర్పడి చేధనలో నిమగ్నమయ్యారు. అయితే, రాధిక హత్య కేసులో విచారణ జరుపుతున్న అధికారులకు అడుగడుగునా సరైన వివరాలు తెలపకుండా, వేర్వేరు కారణాలు చెప్తూ దర్యాప్తును కొమురయ్య తప్పుదారి పట్టిస్తూ వచ్చాడు. దీనిని పసిగట్టిన పోలీసులు అటు విచారణ చేస్తూనే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సిసి కెమెరాలు, పాత నేరస్తుల కదలికలు, సైబర్ ఫోరెన్సిక్ టెక్నిక్స్, వీడియో ఎన్హన్స్మెంట్ టెక్నాలజీ ఉపయోగిస్తూ హైద్రాబాద్ నుండి ప్రప్రథమంగా జర్మన్ టెక్నాలజీ ని ఉపయోగించారు.
జర్మన్ టెక్నాలజీని ఉపయోగించిన హైద్రాబాద్  క్లూస్ టీం మృతురాలి ఇంటి మిద్దెపై ఆరవేసిన కొంరయ్య బనియన్ల, అతని చెప్పులపై రక్తపు మరకలను గుర్తించింది. వీటిని స్టేట్ ఎఫ్.ఎస్.ఎల్. కు పంపి అతితక్కువ సమయంలో డి.ఎన్. ఏ. ఫింగర్ ప్రింటింగ్ ఎనాలిసిస్ చేయగా మృతురాలి డి.ఎన్. ఎ. మరియు అట్టి బనియన్లు, చెప్పుల మీద ఉన్న రక్తం మరకల డి.ఎన్. ఏ. సరిపోల్చగా ఒక్కటే అని నిర్దారణ జరిగింది. ఈ నేరం చేసింది రాధిక తండ్రి కొమురయ్య నే అని నిర్దారించుకొని, అదుపులోకి తీసుకొని విచారించగా, తను నేరం చేసిన విధానం ను మొత్తం ఒప్పుకోవడంతో కేసు మిస్టరీ వీడిపోయింది. తన ఇంటిలో బియ్యం బస్తాలో దాచిన బంగారు చైన్, రాధిక కప్పుకున్న రగ్గును చూపించగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడు కొమురయ్య ను అరెస్ట్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక కేసు చేదనలో కీలకంగా వ్యహహరించి, నిందితుడిని పట్టుకోవడంలో శ్రమించిన పోలీసు అధికారులను పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *