క్యాన్సర్ పై విద్యార్థుల్లో అవగాహన కోసం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, సెప్టెంబర్ 6: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ తో మరణిస్తున్నారు. ప్రపంచంలో క్యాన్సర్ మరణాలకు అవగాహన లేకపోవడమే కారణం. ఈ నేపథ్యంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని కళాశాలలో విద్యార్థులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ సంస్థ కూకట్ పల్లి అధ్యక్షుడు మహా శృంగా దాస్, డాక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ పోటీలకు తెలంగాణలోని అధీకృత యూనివర్సిటీలకు అనుబంధమైన అన్ని కళాశాలల విద్యార్థులు అర్హులని తెలిపారు. పోటీలలో ప్రవేశం పూర్తిగా ఉచితమని, ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు విద్యార్థులందరినీ ఇస్కాన్ ఆహ్వానిస్తున్నదని, పాల్గొనే విద్యార్థులు ఈ వెబ్ సైట్ (www.killthecancer.in)లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు ప్రక్రియ నవంబర్ 30 వరకు ఉంటుందని చెప్పారు. ఈ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచే విద్యార్థులకు ప్రోత్సాహకరంగా 10 లక్షల రూపాయల బహుమతులను అందజేస్తున్నట్లు వివరించారు. ఇస్కాన్ లాభాపేక్షలేని ఆధ్యాత్మిక సేవా సంస్థ అని, ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలోనూ సేవలందిస్తున్నదని, దీనిని 1966లో దైవజ్ఞ ఏసి భక్తివేదాంత ప్రభుపాద స్వామి అమెరికాలో స్థాపించారని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషనల్ సర్వీస్ స్కీమ్ పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్ల వివరించారు. క్యాన్సర్ అంటువ్యాది కాదని, దీన్ని ఆదిలోనే గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో తమవంతుగా ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ హరికాంత్, సిఏ నిరంజన్ చారి, జె.సత్యనారాయణ రెడ్డి, మనోహరాచారి, నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.