ఇక ఇంటికే ఆ కిట్….!
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
హైదరాబాద్, జూలై 11: ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా బాధితులకు కొంతమేర ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ఇంటి (హోం ఐసోలేషన్) లో ఉండి కరోనా చికిత్స పొందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దరిమిలా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటిలో ఉన్న వారికి ఐసోలేషన్ కిట్ (అవసరమైన ఔషధాలు, మాస్కులు, శానిటైజర్లు, ఏలా వ్యవహరించాలో తెలిపే పుస్తకం) పూర్తి ఉచితంగా వారింటికే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడం, రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మందికిపైగా హోం ఐసోలేషన్‌లో ఉండటం, జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్నప్పటికీ ఎలాంటి మందులు వేసుకోవాలి? వాటిని ఎలా వాడాలి? ఎవరిని సంప్రదించాలనే విషయంలో అయోమయం నెలకొనడంతో బాధితులు మరింతగా భయపడుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. వారి అవస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన అన్నింటినీ నేరుగా వారి ఇంటికే తీసుకెళ్లి ఇవ్వాలని నిర్ణయించింది. 17 రోజులపాటు ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టకుండా ఉండేలా అవసరమైన వస్తువులు, ఔషధాలను కిట్‌లో ఉంచి సరఫరా చేయనుంది. బాధితుడు ఇంట్లో ఉంచి చికిత్స పొందుతున్న విషయాన్ని వైద్యాధికారులు నిర్ధారించుకున్న వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రి నుంచి కిట్‌ను తీసుకెళ్లి అందిస్తారు. ఇంట్లో ఎంతమంది బాధితులు ఉంటే అందరికీ వాటిని అందిస్తారు. ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కరోనా బాధితులకు ఇది ఊరట కలిగించే అంశం కాగా, మరీ సరఫరా ఏలా ఉంటుందో వేచి చూడాల్సిందే.