JMS News Today

For Complete News

ఏదైనా ఇక్కడి నుంచే…!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, జూలై 21: కరీంనగర్ లో ప్రతిరోజు ప్రజలందరికీ మంచినీరు అందించే ఓ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం మొత్తంలోనే కరీంనగర్ నుంచి ఏ పని, పథకం ప్రారంభించినా విజయవంతమవుతుందని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతారని, అందుకే కరీంనగర్ నుంచే అనేక కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభించారని తెలిపారు. మంగళవారం కరీంనగర్ లో డెయిలీ వాటర్ సప్లై స్కీం ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ ఇక్కడ ప్రారంభించిన డెయిలీ వాటర్ సప్లై స్కీం త్వరలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేపడుతామని తెలిపారు. భవిష్యత్తులో 24 గంటల మంచినీటి సరఫరా కూడా కరీంనగర్ నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. రూ.109 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమం 2048 వరకు ఉండే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టామని తెలిపారు. పెరుగుతున్న కరీంనగర్ నగర అభివృద్ధి, విస్తరణ దృష్టిలో పెట్టుకుని ఈ బృహుత్తర కార్యక్రమం 94 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో ప్రారంభించామని వివరించారు. చిన్నపాటి లోటుపాట్లను సరిద్దిద్దుకుంటూ ఈ పథకాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో కరీంనగర్ లో డెయిలీ వాటర్ సప్లై స్కీం ప్రారంభించామని అన్నారు. గడిచిన ఆరేళ్లలో మౌళిక రంగాలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టి ఒక్కటొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నారని, అందులో భాగంగానే 24 గంటల నాణ్యమైన విద్యుత్ ను అందిస్తున్నామని చెప్పారు.
ఇప్పుడు కరెంట్ పోతే వార్త అనే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. సీఎం ఎంతో పట్టుదలతో గోదావరి, కృష్ణా జలాలను బీడు భూములకు మళ్లించి తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. వాయు వేగంతో అనేక ప్రాజెక్టులు పూర్తి చేస్తున్న విషయం మీరు చూస్తున్నారని, కేంద్రం కూడా మనల్ని ప్రశంసిస్తోందని అన్నారు. భారదేశానికే తెలంగాణ ధాన్యాగారంగా మారిందని, ఇరిగేషన్ శాఖను జలవనరుల శాఖగా మార్చారని తెలిపారు. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని బలోపేతం చేసే దిశగా పనులు చేస్తున్నామని, విద్యుత్, సాగు, తాగునీరు రంగాల్లో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసామని, విద్య, వైద్యంపై దృష్టి సారించి ముందుకు వెళ్తున్నామని వివరించారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కరీంనగర్ కోసం అర్బన్ లంగ్ స్పేస్ మంత్రి గంగుల అడిగారని, అది కూడా సమకూరుస్తామని హమీ ఇచ్చారు.
2017లో సీఎం కేసీఆర్ నాటిన మొక్కలు ఇప్పుడు ఏపుగా పెరగడం చూస్తే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా గతంలో ఇంత పెద్ద ఎత్తున ఎవరూ చేపట్టలేదని తెలిపారు. కరీంనగర్ లో స్లైక్లింగ్ పార్కును కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కరీంనగర్ మానేరు వంతెనపై కేబుల్ బ్రిడ్జి వంతెన నిర్మాణం 90 శాతం పూర్తి కావచ్చిందని, కలలో కూడా ఊహించని అనేక పనులు గత ఆరేళ్లలో పూర్తి చేసామని అన్నారు. అలుగునూరు చౌరస్తాను గేట్ వే ఆఫ్ కరీంనగర్ గా తీర్చిదిద్దుతామని, ఎన్ని డబ్బులు ఖర్చైనా దాన్ని పూర్తి చేద్దామని, కరీంనగర్ నగరం ఐదారేళ్లలో ఎంతో అద్భుతంగా మారిందని తెలిపారు. కరీంనగర్ లో రూపాయికి నల్లా కార్యక్రమం లాంటి పథకాలు గతంలో ప్రారంభించామని, నళ్లా లేని వాళ్లు ఇంకా ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. కరీంనగర్ లో ఐటీ టవర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ ఫలాలు జిల్లాలకు కూడా విస్తరిస్తున్నాయని అన్నారు. కరీంనగర్ ఐటీ టవర్ లో ఐటీ కంపెనీలతో పాటు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నామని,15 వేల నుంచి 60 వేల వరకు వేతనాలు పొందేలా కరీంనగర్ ఐటీ టవర్ లో ఉద్యోగాల నియామకాలు జరుగుతున్నాయని, కరీంనగర్ ఎన్.ఆర్.ఐ. మిత్రులు ఇక్కడి ఐటీ టవర్ లో తమ శాఖలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మాతృభూమికి సేవ చేసుకునేందుకు ఇది మంచి అవకాశమని తెలిపారు. కోవిడ్ తర్వాత అనేక మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నామని, నేదునూరు విద్యుత్ కేంద్రం కోసం సేకరించిన స్థలాన్ని, ఎస్సారెస్పీ ఖాళీ స్థలాలను కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ కు డెయిలీ వాటర్ సప్లై అందించాలన్న కల సాకరమైందని, గతంలో రోజు విడిచి రోజు నీళ్లు వచ్చేవి. ఇకపై ప్రతి రోజు నీటి సరఫరా ఉంటుందని చెప్పారు.
త్వరలోనే కరీంనగర్ నగరానికి 24 గంటల మంచినీటి సరఫరాను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ కే పరిమితమైన ఐటీ రంగాన్ని కరీంనగర్ కు తేవాలని ఇక్కడ 34 కోట్లతో ఐటీ టవర్ నిర్మించామని, కరీంనగర్ యువతకు స్థానికంగా ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్మించిన ఐటీ టవర్ ను శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ఘనత కేటీఆర్ కే దక్కిందని కొనియాడారు. ఓ వైపు ఐటీ టవర్ పూర్తి చేసామని, మరోవైపు మానేరుపై కేబుల్ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావస్తున్నాయని,
బ్రహ్మాండంగా కరీంనగర్ లో ప్రధాన రహదారులు నిర్మించామని, అన్ని రకాలుగా కరీంనగర్ ను అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని ఇక్కడి ప్రజలు మరవబోరని పేర్కొన్నారు. లోయర్ మానేరు డ్యాంలో ఉన్న నీళ్లన్నీ కాళేశ్వరం జలాలేనని, అందుకే కరీంనగర్ నిత్యనీటి సరఫరాకు “కేసీఆర్ జలం..ఇంటింటికి వరం” పేరుతో ఈ స్కీంను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. కేసీఆర్ కరీంనగర్ సిటీ రినవేషన్ పేరుతో రూ. 315 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, గతంలో ఆమరణ దీక్ష సందర్భంగా కేసీఆర్ అరెస్టైన అలుగునూరు చౌరస్తాకు కేసీఆర్ ఐలాండ్ గా నామకరణం చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కలెక్టర్ కె శశాంక, మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *