ఇక ఇక్కడే ఉద్యోగం…
1 min read(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, జూలై 12: కరీంనగర్ మానేరు తీరాన నిర్మాణమవుతున్న ఐటి టవర్ పనులు తుది దశకు చేరుకున్నాయని, నగర ప్రజల చిరకాల వాంఛ తీరబోతుంది అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఐటీ టవర్, బి.సి స్టడీ సర్కిల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన ఐటి టవర్ నిర్మాణం, బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అన్నవారికి కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి నిదర్శనమని అన్నారు. నగరం నడిబొడ్డులో ఐ టి టవర్, బిసి స్టడీ సర్కిల్ నిర్మాణం కావడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కరీంనగర్ లో చదువుకున్న బిడ్డకు కరీంనగర్ లో ఉద్యోగం చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.25 కోట్లతో ఐటీ టవర్, రూ.5 కోట్లతో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణానికి నిధులు కేటాయించారని అన్నారు. ఐటి టవర్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్ లో చదువుకున్న బిడ్డ కరీంనగర్ లో ఉద్యోగం చేసుకోవచ్చని, ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, బొంబాయి వంటి మహానగరాలకు పోయే అవసరం ఉండదని అన్నారు. ఇప్పటికే ఐటీ టవర్ నిర్మాణ పనులు 90 శాతం పూర్తి అయ్యాయని, పిఓపి, గ్రైనేట్ ఎలివేషన్ పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. ఐటి టవర్ నిర్మాణం జనవరి కల్లా పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికే 11 ఫారన్ కంపెనీలు (ఎంఓయు) చేసుకున్నాయని గుర్తు చేశారు. బిసి స్టడీ సర్కిల్ నిర్మాణం పనులు తుది దశకు చేరుకున్నాయని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో బీసీ స్టడీ సర్కిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే భూమి కేటాయించలేదని ఎద్దేవా చేశారు. ఒక బీసీ ఎమ్మెల్యేగా రూ.5 లక్షలతో బీసీ స్టడీ సర్కిల్ మంజూరు చేయించానని అన్నారు. బిసి స్టడీ సర్కిల్ G+5 అంతస్తుల నిర్మాణం పూర్తి కావస్తుందని అన్నారు. ఐఎఎస్, ఐపీఎస్ అకాడమీ కోచింగ్ కోసం చివరి అంతస్తులో గదులను కేటాయిస్తామన్నారు..ఈ కార్యక్రమంలో సంబంధిత కాంట్రాక్టర్లు. మాజీ కార్పొరేటర్లు, సునీల్ రావు ,చల్లా హరిశంకర్, బండారి వేణు తదితరులు పాల్గొన్నారు.