JMS News Today

For Complete News

రేపు అధికారికంగా ఆయన అంత్యక్రియలు

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

హైదరాబాద్, జూలై 28: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్. జైపాల్‌రెడ్డి (77) అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని అంత్యక్రియల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం ఉదయం జైపాల్‌రెడ్డి ఇంటినుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌కు పార్థివదేహాన్నితరలించి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం ఉంచనున్నారు. మధ్యాహ్నం నెక్లెస్ రోడ్‌లో పీవీ ఘాట్ వద్ద జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, జైపాల్‌ రెడ్డి భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. ప్రగతి భవన్‌ నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళ్లిన కేసీఆర్‌.. జైపాల్‌రెడ్డి పార్థివదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను కేసీఆర్‌ ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు కేకే, సంతోష్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా జైపాల్‌రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా రాష్ట్రపతి కోవింద్‌ పేర్కొన్నారు. అలాగే మంత్రి జైపాల్‌రెడ్డి మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి ప్రజా సేవకే అంకితమయ్యారన్నారు. మంచి వక్తగా, పాలనాదక్షుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. జైపాల్ రెడ్డి మృతి పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రగాఢ సంతాపం తెలియజేశారు. జైపాల్‌రెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జైపాల్‌రెడ్డి మరణవార్త ఎంతో బాధ కలిగించిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌, తెలంగాణ ముద్దుబిడ్డ అన్నారు. జైపాల్‌రెడ్డి జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఆయన మరణం పట్ల నేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  జైపాల్ రెడ్డి మృతి పట్ల కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తన అనుబంధాన్ని స్మరించుకుని భావోద్వేగాలకు లోనైన రమేశ్ కుమార్ కంటతడి పెట్టారు. జైపాల్ రెడ్డి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటు అని, ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *