చప్పట్ల మోత..కరోనా అంతానికి నాంది..
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 22: కరోనా అంతానికి నాందిలా చప్పట్ల మోత కొనసాగింది. అటు సీఎం, డీజీపీ స్థాయి నుంచి సర్పంచ్, అటెండర్ వరకు…ఇటు కార్మికుడు నుంచి కర్షకుడు వరకు ఇలా సబ్బండ వర్ణాలు చప్పట్లు కొట్టి తమ సంఘీభావం ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి ఎదుర్కోవడంలో విశేషమైన తెగువ, సాహసాలను ప్రదర్శిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బందిని అభినందిస్తూ ప్రజలు ఈ సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో హోరెత్తించారు. మోదీ ఇచ్చిన పిలుపుమేరకు దేశవ్యాప్తంగా స్పందించిన ప్రజలు తమ నివాసాల వెలుపలికి వచ్చి పోలీసులు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సేవలను ప్రశంసిస్తూ కరతాళ ధ్వనులు చేశారు. జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చే సందర్భంలో మోదీ దేశ అత్యవసర సిబ్బందికి సంఘీభావం ప్రకటించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ వెలుపలికి వచ్చి చప్పట్లు కొట్టాలని పేర్కొన్నారు. ప్రధాని సూచనకు అపూర్వ స్పందన వచ్చింది. ఏపీలో సీఎం జగన్, తెలంగాణలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చప్పట్లతో అభినందనలు తెలిపారు. జనసేనాని పవన్ కల్యాణ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తమ తమ నివాసాల్లో గంట మోగించి సంఘీభావం ప్రకటించారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ కుమార్ చప్పట్లతో స్వాగతం పలికారు. మొత్తానికి చప్పట్ల మోత..కరోనా అంతానికి నాందిలా కొనసాగింది.