జనతాకు జై..లాక్ డౌన్ కు సై….
1 min read
(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)
కరీంనగర్, మార్చి 22: జనతా కర్ఫ్యూ కు జనం జై కొట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు జనాలు ఇళ్ళకే పరిమితమయ్యారు. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూసివేయగా, రవాణా వ్యవస్థ స్థంభించిపోయింది. ఫలితంగా నిత్యం జనాలతో కిటకిటలాడే వ్యాపార సముదాయాలు బోసిపోయి కనిపించగా, రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనతా కర్ఫ్యూ సందర్భంగా జిల్లా మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్, కలెక్టర్ కె శశాంక, మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, మేయర్ సునీల్ రావు, ఎమ్మెల్యేలు ఇంట్లోనే ఉండి కుటుంబ సభ్యులతో గడిపారు. సాయంత్రం 5గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. అలాగే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రజలు చప్పట్లతో సంఘీభావం ప్రకటించారు. సీపీ కమలాసన్ రెడ్డి జనతా కర్ఫ్యూ ను పర్యవేక్షించారు. కరోనా ఎఫెక్ట్ ఏరియాలో వైద్య బృందాల తనిఖీలు కొనసాగాయి. బల్దియా ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన విస్తృత సానిటేషన్ చర్యలు కొనసాగాయి. ట్రాక్టర్ల ద్వారా హై స్పీడ్ జెట్స్ తో రోడ్లపై హైపో క్లోరైడ్ (లిక్విడ్ బ్లీచింగ్ పౌడర్) స్ప్రే చేశారు. ఇదిలా ఉండగా, సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్లో ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ (కోవిడ్-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశమనంతరం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారు. దేన్నయిన ఎదుర్కోగలం అనే సంఘీభావం ప్రకటించారన్నారు. ప్రజలంతా ఇప్పటివరకు ఎలా క్రమశిక్షణతో ఉన్నారో..మార్చి 31వరకు ఇంటి దగ్గరే ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఏ ప్రదేశంలో కూడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. ఎవరి ఇండ్లకు వారు పరిమితం కావాలని సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. బియ్యంతో పాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు. మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్ వాహనాలు బంద్ ఉంటయన్నారు. మొత్తానికి కరోనా ను తరిమేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకోగా, ప్రజలు సైతం తమవంతు కర్తవ్యంగా కరోనా పై యుద్ధం చేసేందుకు సిద్ధం అవుతున్నారు.