JMS News Today

For Complete News

పోరుబాట వైపు జర్నలిస్టులు….!

1 min read

(జెఎంఎస్ న్యూస్ టుడే.కామ్)

కరీంనగర్, ఆగస్టు 8: తమ సమస్యల సాధన కోసం జర్నలిస్టులు పోరుబాట వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10, 13తేదీలలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఆదివారం స్థానిక ప్రెస్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే- ఐజెయు) జిల్లా కార్యవర్గ సమావేశంలో సమస్యల సాధన కోసం పలు తీర్మాణాలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలోపు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివేశన స్థలాలు కేటాయించాలని జిల్లా కార్యవర్గ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జర్నలిస్టులకు నివేశన స్థలాల కేటాయింపుకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అమలు జరుగుతున్న జిఓలను అమలు చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో 15సంవత్సరాల పైబడి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు నివేశన స్థలాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని సమావేశం అభిప్రాయ పడింది. ఈ క్రమంలో నివేశన స్థలాలతోపాటు జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల సాధన కోసం ఈ నెల 10న కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన, ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. అలాగే ఈ నెల 13న జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులతో హుజురాబాద్ లోని అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన ప్రదర్శన, అక్కడి నుంచి జమ్మికుంట గాంధీ చౌక్ వరకు పాదయాత్ర చేపట్టాలని కార్యవర్గం తీర్మాణించింది. ఈ నెల 16న ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్బంగా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హమీ రానిపక్షంలో ఆందోళనలు మరింత ఉదృతం చేయాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ, తమ సమస్యల సాధన కోసం ఈ నెల 10, 13న తలపెట్టిన కార్యక్రమాలలో పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొని ఆ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దృష్టి పడేలా తమ నిరసన ప్రదర్శనలు ఉండాలని, ఇందుకు జిల్లా సంఘం, మండల బాధ్యులు ఐక్యంగా కృషి చేయాలని వారు కోరారు. టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి స్వామి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహరావు, ఈద మధుకర్ రెడ్డి, కౌన్సిల్ సభ్యుడు ఎలగందుల రవీందర్, జిల్లా కోశాధికారి శరత్ రావు, ఉపాధ్యక్షుడు వొద్దమల్ల విజయ భాస్కర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి నర్సింగోజు మహేంద్ర చారి, సంయుక్త కార్యదర్శులు షుకూర్, సందీప్, ఆసద్ లతోపాటు కార్యవర్గ సభ్యులు, వివిధ దినపత్రికల స్టాప్ రిపోర్టర్లు, బ్యూరోలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మరణించిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *